landing of aircraft on national highway: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికలగుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 29న విమానాల ట్రైల్ రన్ నిర్వహణ ఏర్పాట్లపై భారత వైమానిక దళం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ లైన్స్ రాడర్ పనితీరును ఆమె పరిశీలించారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ: జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాలు తరలించే అంశాలపై అధికారులతో చర్చించారు. జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతం దక్షిణ భారతదేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానుందని కలెక్టర్ తెలిపారు. విపత్తు సమయాలలో విమానాలు అత్యవసరంగా ఆగడానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతాన్ని జాతీయ రహదారిపై నిర్మించినట్లు కలెక్టర్ వివరించారు. ఇలా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై చేపట్టిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతం బాపట్ల జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్నామన్నారు. ట్రైల్ రన్ కూడా నిర్వహించడం దక్షిణ భారతదేశంలోనే ప్రథమమని చెప్పారు.
2023 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదిగా ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. భవిష్యత్తులో అత్యవసర సమయాలలో విమాన యాన సేవలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 29వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైల్ రన్ నిర్వహించడానికి వాహనాలకు ఇబ్బందులు కలగకుండా మరొక దారి నుంచి పంపుతామన్నారు. ప్రజలు కూడా ఆ రహదారిలో వెళ్లకుండా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆమె సూచించారు. సమీప గ్రామస్తులు కూడా సహకరించాలని ఆమె కోరారు.
కెప్టెన్ ఆర్.ఎస్ చౌదరి: ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో విమానాలు దిగడానికి ఈనెల 29వ తేదీన ట్రైల్ రన్ నిర్వహిస్తున్నామని భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్ చౌదరి తెలిపారు. విమానాలు దిగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. గురువారం ఆ ప్రాంతమంతా సూర్యలంక వైమానిక దళం భద్రత పరిధిలో ఉంటుందన్నారు. ఇప్పటికే రాడార్లు, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలు, సామగ్రి ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే భారత సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని ఆయన వివరించారు.