YSRCP Activists Attack On TDP Leader : అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగ్గా.. వారం రోజుల కిందట జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ఐసీడీఎస్ కార్యాలయ ఉద్యోగులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలు మరువకముందే తాజాగా రామాపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున నాయుడు అనే టీడీపీ కార్యకర్తపై.. అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో.. పని చేయకుండానే కొందరి పేర్లపై బిల్లులు పొందుతున్నారని మల్లికార్జున నాయుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ సమీపంలో అడవి జంతువులను కొందరు కార్యకర్తలు చంపేస్తున్నారని గతంలో ఫిర్యాదు నమోదైంది. అయితే మల్లికార్జున్ నాయుడే తమపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు అన్న అనుమానంతో.. పది రోజులుగా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో మల్లికార్జున్ ముందస్తుగా తనకు వైసీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని రెండు రోజులు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల గ్రామానికి వచ్చి కొద్దిమంది నాయకులను మందలించి.. మల్లికార్జున నాయుడును బుధవారం స్టేషన్‌కు రావాలని చెప్పారు. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన అతన్ని.. మార్గమధ్యలో మామిడి తోట వద్ద కాపు కాసి వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మల్లికార్జున్ని చికిత్స నిమిత్తం బంధువులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త మల్లికార్జున్‌ను ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు పాల్పడటం ఆ పార్టీ నేతల పిరికి పంద చర్య అని ఆయన విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, మాఫియా వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గాయపడిన మల్లికార్జున నాయుడు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటూ ఆదుకుంటామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి:
- ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. పారిశుద్ధ్య కార్మికుల సొమ్ముపై విచారణ జరపమని దిల్లీ నుంచి ఆదేశం
- 'కృత్రిమ మేధ'పై ఫోకస్.. డేటా గవర్నెన్స్ విధానం.. సీతమ్మ అందించు డిజిటల్ భారతం
- భర్తతో గొడవపడి.. పిల్లలకు ఎలుకల మందు పెట్టిన తల్లి.. ముగ్గురు చిన్నారులు మృతి
- ఆస్తి కోసం 80 ఏళ్ల బామ్మను ఇంట్లో నుంచి గెంటేసిన మనమడు.. అధికారుల ఎంట్రీతో..