Groom Goes Missing Before The Wedding: మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. లింగంపల్లి శివకుమార్(28)కు మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. రెండు ఇళ్లలో కుటుంబసభ్యులు సంబురాల్లో మునిగిపోయారు. శివకుమార్ ఉదయం 8 గంటలకు ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు.
సెల్‌ఫోన్‌లో సంప్రదించినా సమాధానం లేదు. మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని యువకుడు ఎక్కడికి పోయాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం పెళ్లికూతురు కుటుంబసభ్యులకు తెలియడంతో యువకుడి ఇంటికి వచ్చి నిలదీసి గొడవకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు చేరుకుని సర్ది చెప్పారు. శివకుమార్ కనిపించకుండా పోయాడని యువకుడి బావ కొండం భాస్కర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుర్కపల్లి ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.
ఇవీ చదవండి: