APMDC Danger zone villages: గనులలో జరిగే బ్లాస్టింగ్ వలన అక్కడ ఉన్న గ్రామాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. భారీ ఎత్తున గనులలో బ్లాస్టింగ్ జరగడం వలన ఇల్లు నెర్రెలు చీలి దెబ్బతింటున్నాయి. దుమ్ము ధూళి వలన అనేక రకాల జబ్బులు బారిన పడుతున్నారు. రాత్రిలో ఇంట్లో నిద్రించాలన్న భయం భయంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. గనిలో జరిగే భారీ పేలుళ్లతో ఇళ్లు నేలకొరగడమే కాకుండా ప్రాణాలు సైతం పోతున్నాయని గ్రామస్థులు తెలిపారు.
ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి దశాబ్ద కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు మాత్రం డేంజర్ జోన్ పరిధిలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 90 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని రెండు, మూడు నెలల్లో అగ్రహారం గ్రామానికి పునరావసం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా డేంజర్ జోన్ పరిధిలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని మౌలిక వస్తువులతో కూడిన వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
'అన్నమయ్య జిల్లాలో మంగంపేట బైరైటీస్ ముగ్గురాయి గనులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత నాణ్యమైన బైరైటీస్ నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. ఈ గనులు 1975 నుంచి ఏపీఎండీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఎండీసీ గనులను విస్తరించే దిశగా ప్రభుత్వం గనుల చుట్టూ ఉన్న గ్రామాలను డేంజర్ జోన్ పరిధిలోకి తెచ్చి ఖాళీ చేయించి వేరొక చోట వారికి పునరావాసం కల్పించారు. తొలి విడత కింద మంగంపేట పంచాయతీ పరిధిలోని అయ్యపరెడ్డిపల్లి, గుత్తి కొట్టాలు, అగ్రహారం గ్రామాలు చెందిన ప్రజలను తరలించారు. ఈ గ్రామాలకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు. రెండో విడత గని విస్తరణలో భాగంగా అగ్రహారం గ్రామాన్ని, కాపుపల్లి, అరుంధతివాడ, హరిజనవాడ గ్రామాలను డేంజర్ జోన్ పరిధిలోకి తెచ్చి 2012లో కొందరికి బాధితులకు పరిహారం కూడా చెల్లించారు. అప్పటినుండి ఇప్పటివరకు అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామాలను తరలించలేదు.' -గ్రామస్థులు
గురువారం బ్లాస్టింగ్ వలన నెర్రెలు చీలి ఉన్న ఇంటి గోడ కూలడంతో ఈశ్వర్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పెళ్లియిన పది సంవత్సరాలకు మల్లికార్జున, అరుణ దంపతులకు ఆ బాలుడు జన్మించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి గోడ కూలి మృతి చెందడంతో గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగింది. దీంతో అగ్రహారం గ్రామస్తులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. బాలుని మృతదేహంతో ఏపీఎండీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడించడంతో అధికారులు, నాయకులు అక్కడికి వచ్చి అగ్రహారం గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చనిపోయిన బాలుడికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం వారి కుటుంబంలోని ఒకరికి ఏపీఎండీసీలో ఉద్యోగం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: