Ex Naxalite Narasimha Reddy : అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లికి చెందిన మాజీ నక్సలైట్ చదివి రాళ్ల నరసింహారెడ్డికి శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది. 2004 ఫిబ్రవరి 21న అప్పటి రామాపురం మండల జడ్పీటీసీ అభ్యర్థి సిద్దయ్య, లకిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వాసుదేవ రెడ్డిలను నక్సలైట్లు హత్య చేశారు. 2004లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన విజయబేరి సభకు తెదేపా నేతలు ఎవరు వెళ్లవద్దని అప్పటి బహుదా దళం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే సభకు వెళ్లేందుకు సిద్ధమైన ఇరువురు నేతలను నక్సలైట్లు హతమార్చారు. అప్పట్లో రామాపురం పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నరసింహారెడ్డిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. ఈ కేసు విచారణ 18 ఏళ్లపాటు కొనసాగింది. 2005లో నరసింహారెడ్డి జన స్రవంతిలో కలిసిపోయారు.
నరసింహారెడ్డిపై నేరారోపణ రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్షతోపాటుగా.. రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నరసింహారెడ్డి ప్రస్తుతం రామాపురం మండలంలోని బండపల్లి గ్రామ వైకాపా నాయకుడిగా కొనసాగుతున్నారు. గ్రామంలో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హత్యకు గరైన సిద్దయ్య, వాసుదేవరెడ్డి నక్సలైట్ నరసింహారెడ్డిలు ఒకే పంచాయతీకి చెందినవారు కావడం విశేషం.
ఇవీ చదవండి: