Woman Cultivating Saffron Flowers: మాది అన్నమయ్య జిల్లా చిప్పిలి గ్రామం. మా అమ్మ పేరు భార్గవి, నాన్న పేరు శ్రీకాంత్‌రెడ్డి. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి.. ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాను. మన దేశంలో కుంకుమ పువ్వుకు ఓ ప్రత్యేక స్థానముంది. కశ్మీర్‌లో పండిన ఈ పువ్వు కన్యాకుమారి వరకు అక్కడి రైతులే సరఫరా చేయాలి. కానీ ఇప్పుడు అంత భారీగా పంట సాగు అవడం లేదు. అందుకే మార్కెట్‌లో కుంకుమ పువ్వుకు అధిక డిమాండ్ ఉండటంతో నకిలీ సమస్య అధికంగా పెరిగిపోయింది. సాంకేతికత విస్తృతంగా పెరిగిన నేటి రోజుల్లో ఇక్కడెందుకు మనం నాణ్యమైన కుంకుమపువ్వు పండించకూడదు అనే ఆలోచన వచ్చింది. బెనారస్‌లోని వ్యవసాయ పట్టభద్రులు.. ఆచార్యులతో సంప్రదించా.. కశ్మీర్ వెళ్లి అక్కడి వాతావరణం గురించి నేలల పరిస్థితులపై అధ్యయనం చేశాను. చిప్పిలి వాతావరణానికి తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేయాలో ఓ అంచనాకు వచ్చా. కశ్మీర్, బెనారస్, అలహాబాద్, తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిబ్బంది సాయంతో పంట సాగు చేయడానికి శ్రీకారం చుట్టా. ఇందులో నా భర్త శ్రీనాథ్‌రెడ్డి సహకారమూ ఎంతో ఉంది.
పది లక్షలతో.. బాగా చలి ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే కుంకుమ పువ్వు మొక్కలు పెరుగుతాయి. అందుకని చిప్పిలిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూ.10 లక్షలతో శీతలగదిని ఏర్పాటు చేశాము. ఎయిర్ కూలింగ్ సిస్టం ద్వారా అక్కడి శీతోష్ణస్థితిని సృష్టించగలిగాం. మొదటిగా 2021 ఆగస్టులో 3.5 క్వింటాళ్ల కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చి నాటాం. ఒక్కోక్క మొక్క నుంచి దాని మొత్తం జీవితకాలంలో 200 నుంచి 250 గ్రాముల వరకు కుంకుమ తీగ ఉత్పత్తి అవుతుంది. దానినే మనం కుంకుమ పువ్వుగా పిలుస్తాం. మెరుగైన విత్తనాలకు క్వింటాకు రూ.30 వేలు నుంచి రూ.50 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. రవాణాకు, విత్తనాలకు కలిపి రూ.1.2లక్షల వరకూ ఖర్చు చేశాను. విత్తనం బరువు ఏడు గ్రాముల ఉంటేనే ఉత్పత్తి అనుకున్న విధంగా ఉంటుంది. ఆగస్టు నుంచి నవంబరు నెలల్లో మాత్రమే పువ్వు వస్తుంది. ఇలా దాదాపు ఆరేళ్ల వరకు ఉత్పత్తి ఉంటుంది. సంవత్సరం తర్వాత విత్తనం నుంచి అయిదు విత్తనాల వరకు వస్తాయి. వాటిని వేరు చేసుకుని కొత్త మొక్కలుగా వేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వు దిగుబడితో పాటుగా విత్తనాల ద్వారా కూడా సంపాదించుకోవచ్చు.
పసిపిల్లల్లా.. పువ్వుదశలో రోజూ సూర్యోదయ, సూర్యాస్తమయాల తర్వాత వికసించిన పూలను గది నుంచి వేరుచేసి అందులోని తీగలు, రేకలను సేకరించి జాగ్రత్త చేస్తాం. ఇలా తీసిన కుంకుమ పువ్వుకు మార్కెట్‌లో గ్రాముకు 600 రూపాయల వరకు ధర ఉంటుంది. వీటిని ఎక్కువగా మందులు, అగరవత్తులు, సౌందర్య లేపనాల తయారీ ఇంగా మొదలగు వాటిలో వాడతారు. క్యాన్సర్‌కి ఓ మంచి ఔషధంగా సాయపడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇక గర్భంతో ఉన్న వారికి కుంకుమ పువ్వు పాలల్లో కలిపివ్వడం మనకు సాధారణమే! ఏడాదిలో మొదటి పంట చేతికొచ్చింది. భారత ప్రభుత్వ సుగంధ ద్రవ్యాల విభాగం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించాక మార్కెట్‌లోకీ తీసుకొచ్చాం. ఈ కుంకుమ పువ్వు మొక్కలను పసిపిల్లల్లా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. అంత సున్నితమైన పంట ఇది. అయినా విజయవంతంగా పండించగలిగా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంటులో మా శ్రమని, కృషిని మెచ్చుకోవడం మేము పడ్డ కష్టానికి మంచి గుర్తింపుగా అనిపించింది. చాలా సంతోషమేసింది కూడా.
ఇవీ చదవండి: