YSRCP Government Negligence on Industries : కియా! కరువు నేలను కార్ల ఉత్పత్తికి చిరునామా మార్చిన అతిపెద్ద ప్రాజెక్టు! ఓవైపు ఆటోమొబైల్ హబ్‌గా ఉన్న తమిళనాడు మరోవైపు వాణిజ్య రాజధాని స్టేటస్ అనుభవిస్తున్న మహారాష్ట్ర! ఈ రెండింటినీ కాదని దక్షిణ కొరియా నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఆగింది కియా కార్! తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లో అదో బిగ్ షాక్! అదీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ! మరి ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పరపతే ఉందా? ఉండుంటే గత నాలుగున్నరేళ్లలో కియాలాంటి చెప్పుకోదగ్గ సంస్థ ఒక్కటైనా ఏపీలో కాలుపెట్టిందా? లేదు సరికదా ఉన్నవే పారిపోయే పరిస్థితి! తెలుగుదేశం హయాంలో ఉత్సాహంగా ముందుకొచ్చిన కియా అనుబంధ పరిశ్రమలు కూడా ఇప్పుడు ముఖం చాటేశాయి. ఇదీ నేడు మసక బారిన ఏపీ బ్రాండ్.
Industries Shifting to Other State From Andhra Pradesh : అసలు ఆనాటి ప్రభుత్వం ఏపీ బ్రాండ్‌ను ఎలా బిల్డ్ చేసింది? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్‌తో రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం సృష్టించారు నాటి సీఎం చంద్రబాబు. థావోస్ వెళ్లారు. అక్కడ రాష్ట్రంలోని అనుకూలతలు వివరించారు. పారిశ్రామికవేత్తల్ని మెప్పించారు. పరిశ్రమలను ఒప్పించారు. మరి జగన్ కూడా థావోస్ వెళ్లారు కదా? అంటారా? ఒక్క థావోస్ ఏంటి? జగన్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15 ఔట్‌రీచ్‌లలో పాల్గొంది. కానీ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్కసంస్థనీ తీసుకురాలేకపోయింది! దావోస్ వెళ్లి కూడా అదానీ, అరబిందో సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దేశీ సంస్థలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లడం ఎందుకనే విమర్శలు తప్ప ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసురాలేకపోయారు జగన్!
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ!
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కక్ష, కార్పణ్యాలకు కేరాఫ్‌గా మార్చిన జగన్ పారిశ్రామికంగానూ అదే పంథా అవలంబించారు! దానికి ఉదాహరణే అమరరాజా బ్యాటరీస్. అమరరాజాను జగన్ సర్కార్ చిత్తూరు జిల్లాకు పారిశ్రామిక గుర్తింపు తెచ్చిన దిగ్గజంగా చూడకుండా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన సంస్థగా చూసింది. కాలుష్యం పేరుతో పొగపెట్టింది. దానికి మూల్యమే 10 వేలకోట్ల రూపాయల వ్యాపార విస్తరణను అమరరాజా తెలంగాణకు మళ్లించింది. ఇలా స్వరాష్ట్రంలోనే ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారు జగన్. గత ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలతో మేడిన్ ఏపీ అంటూ పరిశ్రమల్ని రెక్కలు కట్టుకుని వాలేలా చేస్తే వైఎస్సార్సీపీ సర్కార్ అరాచక ఆలోచనలు, విధ్వంకర విధానాలు, హింసాత్మక పరిణామాలతో కొత్తగా రాబట్టిందేమీ లేకపోగా.. పాత పరిశ్రమల భద్రతనే ప్రశ్నార్థకం చేసింది. అందుకే పారిశ్రామిక వేత్తలకు నేడు ఏపీ అంటేనే బీపీ పెరిగే పరిస్థితి వచ్చింది.
చేజేతులా పారిశ్రామిక విధ్వంసక వాతావరణం సృష్టించిన జగన్ మాటల్లో మాత్రం గొప్ప కథలు చెప్తున్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత అనుకూల ప్రభుత్వం ఉందని ఊదరగొట్టారు. 13 లక్షల 12 వేల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు 386 MOUలు కుదుర్చుకున్నాయని వేదికపైనే ప్రకటించారు. వాటిని కార్యరూపంలోకి తెస్తామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ వేసి ఆరంభ శూరత్వం ప్రదర్శిచారు. పది నెలలు గడిచినా ఇప్పటిదాకా 3వేల 58 కోట్ల విలువైన ప్రతిపాదనల్లో మాత్రమే అంతో ఇంతో కదలిక వచ్చింది! అసలు విశాఖ సదస్సులో ప్రభుత్వ చెప్పిన 13 లక్షల కోట్ల విలువైన ఒప్పందాల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రతిపాదించినవే!
రండి.. పరిశ్రమలు పెట్టండి ! దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీనే కీలకం !: జీఐఎస్ రోడ్ షోలో మంత్రులు
సాధారణంగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు DPRల తయారీ, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొందడానికే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. విశాఖ సదస్సులో 39 సంస్థలు పునరుత్పాదక ఇంధన రంగంలో MOUలు చేసుకుంటే ఇప్పటిదాకా ఏడింటికే ప్రాథమికDPRలు తయారయ్యాయి. మిగితా ప్రక్రియంతా పూర్తై నిర్మాణాలు ప్రారంభించాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని అధికారులే చెబుతున్నారు. అంటే ఆయా ప్రాజెక్టుల ద్వారా అయిదేళ్ల తర్వాతే విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది! గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకూ కేంద్రం నుంచి ఎక్స్‌ప్లోజివ్ లైసెన్సు, ఇతర అనుమతులు ఇప్పట్లో లభించే అవకాశమే లేదు. ఈ లెక్కన ఇంధన రంగంలో వైకాపా సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఏ ఒక్కటీ సమీపకాలంలో సాకారమయ్యే పరిస్థితి లేదు.
ఇవి 2023 అక్టోబరు 4న సీఎం జగన్ వర్చువల్ విధానంలో 13 ప్రాజెక్టులకు జగన్ చేసిన శంకుస్థాపనల దృశ్యాలు! అవి ఏ జిల్లాల్లో ఏర్పాటవుతాయో కూడా చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ABC లిమిటెడ్ లక్షా 20 వేల కోట్లతో ఏటా 250 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్, ఒక మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేస్తామని సంతకాలు చేసింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబోతోందనే వివరాలు మాత్రం చెప్పలేకున్నారు. ఇక రిలయన్స్ సంస్థ ప్రతిపాదించిన 10 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుతో పాటు రెన్యూ పవర్, ACME, TEPSOL ప్రాజెక్ట్స్ లిమిటెడ్, JSW నియో ఎనర్జీ లిమిటెడ్ తదితర సంస్థలు కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాయనే దానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఇదీ పెట్టుబడులపై జగన్ సర్కార్ మాయ.