YCP Leaders Digging Hills: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నేతల ధాటికి ప్రకృతి వనరులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇసుక, మట్టి, రాళ్లు ఇలా ఏదీ వదలకుండా ప్రకృతి వనరులను కొల్లగొట్టేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో వైసీపీ నాయకులు పెట్రేగి పోతున్నా పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. తాడిపత్రి మండలం ఆలూరు, ఆవుల తిప్పాయపల్లి, బుగ్గ, యర్రగుంటపల్లితోపాటు, పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో భారీ యంత్రాలతో కొండలను తవ్వేస్తూ వందలాది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
రాప్తాడు మండలం యర్రగుంటపల్లిలో ముప్పై ఏళ్లక్రితం పది మంది పేదలకు ఐదు ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. రాళ్లు, గుట్టలతో నిండిన ఆ కొండ ప్రాంతాన్ని కొంతవరకు చదును చేసుకోటానికి మట్టిని తవ్వించారు. పదిమందిలో ఇద్దరు మాత్రమే భూమి సాగు చేసుకుంటుండగా మిగిలినవారు బీడుపెట్టారు. ఇదే అదనుగా భావించిన వైకాపా నాయకులు ఆ భూముల్లో ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు. ఒక్కో టిప్పరు ఎనిమిది నుంచి
15 వేల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భవన నిర్మాణ యజమానులకు మట్టిని అమ్మేస్తున్నారు. దీంతో కొండ కరిగిపోయి పది మీటర్ల లోతకు గోతులు పడ్డాయి. మట్టి లోడుతో రోజూ వందల ట్రిప్పులు టిప్పర్లతో తరలిస్తుండటంతో ఆవుల తిప్పాయపల్లి, యర్రగుంటపల్లి, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: