వివాహేతర సంబంధం, డబ్బు వివాదంతో కట్టుకున్న భర్తనే.. భార్య హత్య చేసి పాతిపెట్టిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ఆ విషాదం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన నాగభూషణం ఈశ్వరమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగభూషణం.. అతని భార్యను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఈశ్వరమ్మ.. సమీప బంధువులతో కలిసి అతన్ని హత్య చేసింది. అనంతరం పట్టణ శివారులో పాతిపెట్టింది.
నాగభూషణం కనిపించకపోవడంతో అతని బంధువులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వరమ్మతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల దర్యాప్తులో నాగభూషణంను తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చెప్పడంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి తరలించారు.