Water apple cultivation : అనంతపురం జిల్లాలో రైతులు మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తూ నష్టాల నుంచి బయట పడుతున్నారు. ఈ మిశ్రమ ఉద్యాన పంటలో వాటర్ ఆపిల్ సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. జామ, సపోట, బత్తాయి తోటల్లో చేస్తున్న వాటర్ ఆపిల్ సాగు రైతులకు లాభాలు అందిస్తోంది. ప్రజలకు ఇది కొత్తరకం పండు కావడం, కొనుగోలుపై ఆసక్తి చూపుతుండటంతో వాటర్ ఆపిల్‌తో రైతులు ఆశించిన ఆదాయం పొందుతున్నారు.
అనంతపురం జిల్లా ఉద్యాన పంటల సాగుకు పెట్టింది పేరు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 2.1 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఒకే పంటను సాగుచేయడం వల్ల మార్కెట్‌లో ధరలు పతనమైనపుడు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం దీనిని అధగమించడానికి ఉద్యాన తోటల్లో మిశ్రమ పండ్ల చెట్ల సాగుకు దిగుతున్నారు. ఆరేళ్ల క్రితం సపోట, బత్తాయి తోటల్లో పెంచిన వాటర్ ఆపిల్ సాగుతో ప్రస్తుతం ఆదాయం పొందుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
" వాటర్ యాపిల్ ని కొత్తగా సాగు చేస్తున్నాం. దీనికి మార్కెట్ లో మంచి విలువ ఉంది. పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టనవసరం లేదు. ఇక్కడి కన్నా చెన్నై మార్కెట్ లో డిమాండ్ బాగుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఫలం మంచిదంటున్నారు. " - రంగయ్య, వాటర్ ఆపిల్ రైతు
"ఈ పంటకు పెట్టుబడి తక్కువే. నెలకు రెండుసార్లు మందు కొట్టాలి. ఆరేళ్ల నుంచి సాగు చేస్తున్నాం. ఈ పంట సాగుతో నష్టం లేదు. దిగుమతి బాగుంది. " -పుల్లారెడ్డి, వాటర్ ఆపిల్ రైతు
ఇదీ చదవండి : Migratory exotic birds Death: ప్రాణాలొదులుతున్న వలస వచ్చిన విదేశీ పక్షులు...కారణం అదేనా ?
జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వాటర్ ఆపిల్‌ను చెన్నై నగరానికి ఎగుమతి చేస్తున్నారు. ఈ పండులో చక్కెర శాతం తక్కువగా ఉండి, నీరు ఎక్కువగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా వినియోగిస్తున్నారని రైతులంటున్నారు. ప్రస్తుతం వాటర్ ఆపిల్ కిలో ధర 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. పెట్టుబడి తక్కువ కావటం వల్ల మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నా నష్టం లేదని రైతులు చెబుతున్నారు. ఈ పండు జిల్లా వాసులకు కొత్త కావటంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.
వాటర్ ఆపిల్ పండ్లకు రాష్ట్రంలో పెద్దగా మార్కెట్ లేదని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు.
" వాటర్ యాపిల్ ని అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ పంటకు అంత డిమాండ్ లేదు. ఆసక్తి ఉన్న రైతులు మిశ్రమ ఉద్యాన పంటగా సాగు చేసుకోవచ్చు. ఇక్కడి మార్కెట్ లో పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ..చెన్నై, బెంగళూరుల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట వల్ల నష్టం ఉండదు. పైగా పెట్టుబడి కూడా తక్కువ. " - సతీష్, ఉద్యానశాఖ ఏడీ
ప్రస్తుతం జామ, సపోట పండ్లకు మార్కెట్‌లో ధర తక్కువగా వస్తోంది. ఈ తోటల్లో వాటర్ ఆపిల్‌ను మిశ్రమ పంటగా సాగుచేసిన రైతులకు ఇతర పండ్లతో వస్తున్న నష్టం ఈ వాటర్ ఆపిల్ భర్తీ చేస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : KITES : రంగవల్లుల పండుగకు...పతంగుల సందడి