భర్త ఏడాది కింద మృతి చెందాడు.. ఇద్దరు భార్యలు ఆయనకు ఖరీదైన సమాధి నిర్మించి తమ ప్రేమను చాటుకున్నారు. భర్త సమాధి పక్కనే ఇరువైపులా తమకూ సమాధులు సిద్ధం చేసుకున్నారు. ఆ నిర్మాణానికి శాంతిపూజలు కూడా చేయించేశారు. అక్కడే తమను సమాధి చేయాలని బంధువులకు చెప్పి.. భర్తపై తమకు ఉన్న ప్రేమను చూపుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని దానధర్మాలు చేసేశారు. ఆఖరిరోజుల్లో భర్తనే తలుచుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు..
అనంతపురం గ్రామీణ మండలం కామారుపల్లి చెందిన కురబ రాగే పెద్ద కొండన్న, అంజనమ్మ భార్యాభర్తలు. వీరికి 50 ఏళ్ల క్రితం కేవలం మూడెకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డారు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూనే, మరోవైపు గొర్రెల పెంపకంతో జీవనం సాగించేవారు. అన్నీ ఉన్నా వారికి సంతానం లేని లోటు ఉండేది. తనకు సంతానం కలగలేదని అంజనమ్మ తన చెల్లెలు ఎల్లమ్మను భర్తకు ఇచ్చి వివాహం జరిపించింది. పెద్ద కొండన్నకు రెండో భార్యకూ.. సంతానం కలగలేదు. కుటుంబం అంతా కష్టపడి తమ మూడెకరాల భూమిని 50 ఎకరాలకు పెంచారు. సంపాదనైతే రోజురోజుకీ పెరుగుతోంది కానీ.. పిల్లలు లేని లోటు ఆ ముగ్గురినీ వేధిస్తుండేది. పిల్లలు కావాలనే కోరికతో...బంధువుల అబ్బాయిని దత్తత చేసుకున్నారు. ఎంతో బాగా పెంచుకున్నారు కూడా..కానీ అతనికి యుక్త వయసు రాగానే ఆస్తి మీద కన్నుపడింది. ఆస్తిని దక్కించుకోవటానికి వృద్ధులను శారీరకంగా హింసించాడు. తట్టుకోలేక..చివరకు దత్తత తీసుకున్న యువకుడిని ఇంటి నుంచి పంపించివేసింది కొండన్న కుటుంబం. బిడ్డలులేరని బాధపడే కన్నా.. తమ కష్టార్జితాన్ని దానధర్మాలకే ఖర్చుచేయాలని భావించారు. నాటి నుంచి దానధర్మాలు చేయడం మొదలుపెట్టారు. ఏడాది క్రితం కొండన్న వృద్ధాప్యంతో మృతి చెందారు. తమ భర్త ఆశయాన్ని భార్యలు అంజనమ్మ, ఎల్లమ్మలు నెరవేరుస్తున్నారు. తమ మరణానంతరం భర్త సమాధి పక్కనే పూడ్చేలా సమాధులు నిర్మించుకున్నామని చెబుతున్నారు.
"మాది అనంతపురం గ్రామీణ మండలం కామారుపల్లి. కురబ రాగే పెద్ద కొండన్న మా భర్త. 50 ఏళ్ల క్రితం మాకు కేవలం మూడెకరాల వ్యవసాయ భూమి ఉండేది. కష్టపడి వ్యవసాయం, గొర్రెల పెంపకం చేసి 50 ఎకరాల భూమిని కొన్నాం. పిల్లలు లేకపోవడంతో మా ఆయనకు నాచెల్లిని ఇచ్చి పెళ్లి చేశా. ఆమెకి పిల్లలు పుట్టలేదు. బంధువుల అబ్బాయిని దత్తు తీసుకున్నాం. ఆస్తి కోసం బాధలు పెడితే పంపిచాం. 50 ఎకరాలు అమ్మి దానధర్మాలు చేస్తున్నాం. గుళ్లకు, బడులకు విరాళాలు ఇస్తున్నాం. మా ఆయన గత ఏడాది చనిపోయాడు. ఆయనకు సమాధి కట్టి పక్కనే మాకు కట్టించుకున్నాం. మేము పోయాక మమ్మల్ని ఇక్కడే పూడ్చండి. " - అంజనమ్మ, పెద్ద కొండన్న పెద్ద భార్య
కొండన్న కుటుంబానికి పదికోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి ఉంది. భర్త కొండన్న ఉండగానే కష్టపడి సంపాదించిన 50 ఎకరాల భూమిని అమ్మగా ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ ధనాన్ని ఆలయాలకు, పాఠశాల భవనాల నిర్మాణాలకు విరాళంగా ఇచ్చారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పురాతన ఆలయాలతో పాటు, తమ గ్రామం కామారుపల్లిలోని రాముని ఆలయాన్ని ఆధునీకరించారు. మరో కోటి రూపాయలు కూడేరు మండలం సంగమేశ్వరుడి ఆలయానికి ఇవ్వనున్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలో డబ్బు నిల్వ ఉంచిన అంజనమ్మ, ఎల్లమ్మలు త్వరలో ఆలయ అధికారులకు అందజేయనున్నారు.. తామంతా నిర్ణయం తీసుకున్న మేరకు ఆస్తిని అమ్మి నగదు రూపంలో విరాళాలు ఇస్తున్నట్లు ఎల్లమ్మ చెప్పారు.
"ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తాన్ని ధనాన్ని ఆలయాలకు, పాఠశాల భవనాల నిర్మాణాలకు విరాళంగా ఇచ్చాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పురాతన ఆలయాలకు నగదు అందించాం. ఎవ్వరికీ ఎలాంటి వ్యయ ప్రయాసలివ్వకూడదని మా ఆయన సమాధి పక్కనే సమాధులు నిర్మించుకున్నాం. మేము పోయాక మమ్మల్ని అక్కడే పూడ్చండి " - ఎల్లమ్మ, పెద్దకొండన్న చిన్న భార్య
ఏడాది క్రితం మృతి చెందిన భర్త కోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి 30 సెంట్లలో సుందరంగా ఖరీదైన సమాధి నిర్మించారు. భర్తపై ప్రేమతో మరణానంతరం ఆయన సమాధి పక్కనే తమను కూడా పూడ్చాలని అంజనమ్మ, ఎల్లమ్మలు బంధువులకు చెప్పారు. ఎవ్వరికీ ఎలాంటి వ్యయ ప్రయాసలివ్వకూడదని భావించిన వారిద్దరూ.. ముందుగానే తమకూ సమాధులు నిర్మించుకొని, శాంతిపూజలు కూడా చేయించారు. మరణం తర్వాత ఆయనతోనే అని చెబుతున్నారు...తమ తోబుట్టువులు బతికుండగానే వారి కోసం వారే సమాధులు నిర్మించుకున్నట్లు ఆ మహిళల సోదరుడు చెప్పారు.
ప్రస్తుతం వారికి మిగుల్చుకున్న ఆస్తి ఇల్లే.. ఉంటున్న ఇల్లు తప్ప మిగతా ఆస్తి మొత్తాన్ని అమ్మేసిన ఆ ఇద్దరు మహిళలు అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేస్తున్నారు. దైవకార్యాలకు, పాఠశాలల అభివృద్ధికి విరాళాలు అందిస్తున్నారు.
ఎంతో కష్టపడి కూడబెట్టి సంపాదన మొత్తాన్ని దానధర్మాలు చేస్తూ కొండన్న, ఆయన ఇద్దరు భార్యలు అనంతపురం జిల్లాలో ఆదర్శవంతంగా నిలిచారు. భర్త పోయినా ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ..మరణానంతరం ఆయనతోనే అని సమాధులు సైతం పక్కనే కట్టించుకుని భర్తపై తమ ప్రేమను చాటుకున్నారు ఆ ఇద్దరు మహిళలు.
ఇదీ చదవండి : వర్షాభావ పరిస్థితులు... తీవ్ర నష్టాల్లో వేరుశనగ, కంది రైతులు