making of Kalamkari: కూలీకి వెళ్తేనేగానీ పూట గడవని స్థితి నుంచి ఇంకొకరికి అన్నం పెట్టే స్థాయికి చేరారు.. తమ పిల్లలను పనికి తీసుకెళ్లే దుస్థితి నుంచి బడికి పంపే పరిస్థితికి మారారు.. ఉపాధి లేని దీనవస్థ నుంచి సొంతంగా వస్త్రాలు తయారు చేసే స్థానంలో నిలిచారు.. ప్రత్యేక శిక్షణ పొంది కలంకారీ వస్త్రాల తయారీ, విక్రయాలతో ఆర్థిక సాధికారత దిశగా ముందుకెళ్తున్నారు.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే ఆర్డీటీ సంస్థ కలంకారీ వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలు..
నాలుగు దశాబ్దాల క్రితం
Kalamkari Womens: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం స్పెయిన్ నుంచి అనంతపురం పర్యటనకు వచ్చిన విన్సెంట్ ఫెర్రర్ ప్రజల ఇబ్బందులు చూసి.. అక్కడే స్థిరపడి పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మరణానంతరం ఆర్డీటీ సంస్థ ఆ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా మహిళా సాధికారిత కోసం 2001లో ఆర్డీటీ సంస్థ కలంకారీ వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేసి.. ఎంతోమంది మహిళలకు అండగా నిలుస్తోంది. బుక్కరాయసముద్రంలో నెలకొల్పిన ఈ పరిశ్రమలో శిక్షణ తీసుకున్న మహిళలు.. వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
40 మందితో ప్రారంభమై..
making of Kalamkari: 40 మంది శిక్షణ పొందిన మహిళలతో ఆర్డీటీ సంస్థ.. కలంకారీ పరిశ్రమను ఏర్పాటు చేసి వస్త్రాలు తయారు చేయిస్తోంది. అహ్మదాబాద్, ముంబయి ప్రాంతాల నుంచి ముడి సరుకు తెప్పించి.. ఈ పరిశ్రమలో కలంకారీ రంగులు అద్దుతున్నారు. ఆర్డీటీ సంస్థకు నిత్యం సందర్శకులుగా వచ్చే వందలాది మంది స్పెయిన్ దేశస్థులు కలంకారీ వస్త్రాలను పెద్దఎత్తున కొనుగోలు చేసేవారు. తాము తయారుచేసిన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు శిక్షణ పొందిన మహిళలు చెబుతున్నారు. కలంకారీ వస్త్రాల విక్రయాలతో వచ్చిన లాభాలు మహిళలే పంచుకునేలా ఆర్డీటీ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో లభించే వస్త్రాల కంటే ఆర్డీటీ పరిశ్రమలో తయారుచేసే వస్త్రాలకు ధర తక్కువ కావటం, నాణ్యతగా ఉండటంతో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
మొదట్లో బయట కూలీ పనులకు వెళ్లేవాళ్లం. ఆర్డీటీ సంస్థ శిక్షణ ఇస్తుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చి వస్త్రాలను తయారు చేయడం నేర్చుకున్నాం. బెడ్షీట్లు, డోర్ కర్టన్లు లాంటి తయారు చేస్తున్నాం. విక్రయాల కోసం వేరే ప్రదేశానికి వెళ్తున్నాం. 10 గ్రూపులుగా 280 మంది వరకు ఇక్కడ శిక్షణ తీసుకున్నాం. కరోనా సమయంలో విక్రయం కాస్త తగ్గింది. తయారు చేసిన వస్త్రాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. -మహిళలు, వస్త్ర తయారీదారులు
ఇదీ చదవండి: టమాటాపై లాభం పొందాలనుకున్నాడు... యంత్రాన్ని తయారు చేశాడు