building work with students: చదువు విలువ ఏంటన్నది ఉపాధ్యాయులకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు. బాలలు బడిలో ఉండాలి తప్ప, పనిలో కాదని కూడా వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కానీ.. అనంతపురం జిల్లాలోని ఓ ఉపాధ్యాయురాలు మాత్రం మరో విధంగా ఆలోచించింది. విద్యార్థులందరినీ భవన నిర్మాణ కార్మికులుగా మార్చేసింది.
అనంతపురం గ్రామీణం మన్నీల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శివమ్మ నిర్వాకం ఇది. శివమ్మ.. అనంతపురంలోని ఆదర్శనగర్లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. విద్యార్థులను పిలిపించి ఇటుకలు, సిమెంటు బస్తాలు మోయించారు. అంతేకాదు.. నగరపాలక సంస్థకు చెందిన చెత్త సేకరించే తోపుడుబండ్లను సైతం వినియోగించుకున్నారు.
ఎవ్వరూ చూడరులే అనుకున్నారో.. చూసినా ఎవరేం చేస్తారులే అనుకున్నారో తెలియదుగానీ.. దర్జాగా తన సొంత పని చేయించుకున్నారు. కొందరు జనాలు చూసీ చూడనట్టు వదిలేసినా.. సెల్ ఫోన్ కన్ను మాత్రం కనిపెట్టింది. టీచరమ్మ ఇంటి వద్ద నడిచిన సినిమా మొత్తం షూట్ చేసింది. సదరు వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. జనాలను దాటుకొని, అధికారు వద్దకూ సైతం వెళ్లింది.
ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ని వివరణ కోరగా.. తనకూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఈవో మీనాక్షి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పిన ఆయన.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇదీ చదవండి: