రాయలసీమకు తలమానికంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని అనంతపురం తెదేపా ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కృషితో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జిల్లాకు తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ ఆసుపత్రికి సంబంధించిన 90 శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించటం.. ప్రభుత్వం చేతకానితనమేనని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ