Payyavula ON GO No1: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం సమయంలో చూపిన ధిక్కార బాటనే అవలంబిస్తామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తేల్చి చెప్పారు. మహాత్ముడు నాటి చట్టాలను ధిక్కరించి ఉప్పు తయారీకి యాత్ర చేశారని, తాము అలానే చట్టాన్ని ధిక్కరిస్తాము అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతుందో.. ఎంత మందిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతుందో చూస్తామన్న కేశవ్.. అవసరమైతే జైలు భరోకు వెనుకాడబోమని హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా బీజేపీ అగ్ర నేతగా, గుజరాత్ ఎన్నికల విజయానికి చిహ్నంగా పార్టీ సమావేశానికి హాజరవుతు.. రోడ్డుషో నిర్వహిస్తుంటే.. పోలీసులు అనుమతించారన్న పయ్యావుల.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మారుమూల పల్లెల్లో కూడా రోడ్లపై ప్రదర్శన చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు ఇచ్చిందంటే జగన్మోన్‌రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తుందా..? హిట్లర్, ముస్సోలినీల రాజ్యాంగాలను అనుసరిస్తుందా అనేది దేశ ప్రజలు గమనించాలని కోరారు.
ఢిల్లీలో ప్రదర్శనకు పోలీసులు అనుమతించడం భారతదేశంలో వాక్ స్వాతంత్య్రానికి, రాజకీయ పార్టీల భావప్రకటనా స్వేచ్ఛకు ఉన్న అవకాశమన్నారు. ఇకనైనా వైసీపీ నాయకత్వం, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎమర్జెన్సీలో ఏదైనా జరిగితే కేసు పెట్టారని.. జీవో నెం1 లో దానిని మించి ఏం జరగకుండానే నియంత్రిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి వణికిపోతున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏ ఫలితం రాబోతుందో ప్రజలకు తెలిసిపోతే రేపటి నుంచి వారిని గౌరవించరనే భయంతో వైసీపీ నాయకులు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని పయ్యావుల అన్నారు.
ఇవీ చదవండి: