కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందికి 20 లక్షల రూపాయలతో వివిధ రకాల సామగ్రిని పంపిణీ చేసినట్లు అనంతపురం జిల్లా కదిరి తెదేపా ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెప్పారు. పేదలకు సాయం చేసినా.. వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. తనను క్వారంటైన్ చేయించేందుకు అధికారులపై వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందన్న కనీస అవగాహన లేని వైకాపా నాయకుల తీరును ప్రజలు, అధికారులు తప్పుపడుతున్నారన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న సిద్ధాంతంతో ప్రతి తెదేపా కార్యకర్త ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు.
అవగాహన లేమితో చంద్రబాబుపై విమర్శలు
ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎదురుదాడి చేయడం సరికాదని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి కరోనా గురించి చులకనగా, అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని చంద్రబాబు కోరడం తప్పా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను పొగిడిన వారు నేడు కేసులు ఇంతగా ఏవిధంగా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని బృందం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో రెండేళ్లు మంత్రిగా కొనసాగవచ్చనే ఆలోచనతోనే చంద్రబాబుపై మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: