తెదేపా పార్లమెంట్ కమిటీల్లో బీసీలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి జగన్కు బీసీలు గుర్తొచ్చారా అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. నియంతృత్వాన్ని తలదన్నేలా వైకాపా పాలన ఉందని ధ్వజమెత్తారు. వెనుకబడిన తరగతుల వారికి 3,890 కోట్ల సబ్సిడీ రుణాలు ఇస్తామని జగన్ చెప్పారన్న ఆయన... హామీ అమలులో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. బీసీలకు వైకాపా చేసిన సాయం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
నేతన్ననేస్తం, అమ్మఒడి, వాహన మిత్ర వంటి పథకాల కింద ఇచ్చే సొమ్ముని కూడా బీసీ కార్పొరేషన్ పద్దులో చూపుతున్నారని కాలవ ఆరోపించారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించారని మండిపడ్డారు. బీసీ నేతలంతా వారి చుట్టూ తిరిగితే తప్పా... ముఖ్యమంత్రి దర్శనం లభించే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. జీతభత్యాలు లేని ఛైర్మన్ పదవులను కార్పొరేషన్ల పేరుతో బీసీలకు అప్పగించారని కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రాజకీయ ప్రాధాన్యం లేని పదవులను బీసీలకు ఇవ్వడం ద్వారా వారిని మరింత అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.