తరగతులు, ప్రయోగాలతో నిత్యం కుస్తీ పట్టే యువతకు కరోనా వల్ల తీరిక దొరికింది. అయితే ఈ సమయాన్ని వృథా చేయొద్ధు నట్టింట్లో ఉంటూ.. నెట్టింటి సాయంతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్ఛు సబ్జెక్టుతోపాటు ఇతర అంశాలపైనా పట్టు సాధించేందుకు కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమలోని కళలు, నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మరోవైపు తల్లిదండ్రులే గురువులుగా మారి పిల్లలకు మార్గదర్శకం చేయాలి. చిన్నారులు నచ్చిన అంశంలో ప్రతిభ సాధించేలా ప్రోత్సహించాలి.పిల్లలూ ఆలోచించండి.. ఇంట్లోనే ఉంటూ ఇష్టంగా చదవండి.
ప్రణాళిక తప్పితే భవిత అంధకారమే
ఇంటర్ విద్యార్థులకు మే 5 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ద్వితీయ ఇంటర్ విద్యార్థులు ఏమాత్రం ప్రణాళిక తప్పినా భవిత అంధకారమయ్యే ప్రమాదం ఉంది. ఇంటర్‌లో 68,864 మంది ఉండగా.. అందులో ద్వితీయ విద్యార్థులు 33,241 మంది ఉన్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. సబ్జెక్టును పునశ్చరణ చేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం ఎంసెట్, జేఈఈ, నీట్, బీ ఆర్క్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఆయా మాదిరి ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయాలి. దీంతో అవగాహన పెరుగుతుంది. సమయపాలన వస్తుంది. భయం పోతుంది.
సబ్జెక్టుపై పట్టు సాధించేలా..
డిగ్రీ, పీజీ కోర్సుల్లో 61 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్కేయూ, జేఎన్‌టీయూ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వసతి గృహాలు మూసేశారు. కళాశాలలు తెరిచిఉంటే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాల్లో పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. అందుబాటులో ఉన్న సబ్జెక్టు పుస్తకాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ విద్యార్థులు లర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈ-కంటెంట్ ఉపయోగించుకోవచ్ఛు
విందాం.. నేర్చుకుందాం
1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు లేవు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. అనంతపురం జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 5,133 ఉన్నాయి. 1 నుంచి 9 వరకు 5,63,860 మంది చదువుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్దే ఉండటంతో వారే గురువులుగా మారాలి. పిల్లలకు కొత్త విషయాలు చెప్పాలి. సబ్జెక్టుపై పట్టు సాధించేలా ప్రోత్సహించాలి. చిన్నారులకు ఇష్టమైన అంశాల్లో తర్ఫీదు ఇవ్వాలి. విద్యార్థులు పఠన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గూగుల్ బోలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా హిందీ, ఆంగ్లం నేర్చుకోవచ్ఛు అలాగే చిత్రలేఖనం, నృత్యంపై దృష్టి సారించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలి. వేమన శతకం, సుమతీ శతకం పద్యాలన్నీ బట్టీపడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యూట్యూబ్‌లో ఇంపాక్ట్ లాంటి గ్రూపుల ద్వారా కథలు వినొచ్ఛు
మార్పుతో నేర్పు
ఎంఎన్‌సీ కంపెనీలు అందరిలా కాకుండా ప్రత్యేకత ఉంటేనే ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వర్చువల్ విధానంలోనే ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. అనంత జేఎన్‌టీయూలో 180 మంది తుది సంవత్సరం విద్యార్థులు ఎంపికయ్యారు. మిగతా విద్యార్థులు ఎందుకు ఎంపిక కాలేదో పునశ్చరణ చేసుకొని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి. లిటరేచర్, డాక్యుమెంటేషన్ క్రోడీకరించుకుంటే ప్రాజెక్టు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూమ్, వెబెక్స్, గూగుల్ మీట్‌ను ఉపయోగించుకోవాలి. ప్రోగ్రామింగ్, కోడింగ్, రీజినింగ్, యాప్టిట్యూడ్‌పై నైపుణ్యం పెంచుకోవాలి. గేట్, ఐఈఎస్ సన్నద్ధం కావడానికి అనువైన సమయం ఇదే. 1, 2, 3 సంవత్సరాల విద్యార్థులు ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొచ్చిన ప్యూచర్ ప్రైమ్ స్కిల్స్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా లర్నింగ్ అంశాలను మెరుగు పరచుకోవచ్ఛు సబ్జెక్టుతో పాటు సర్టిఫికేషన్, ఇంటర్న్‌షిప్, మినీ ప్రాజెక్టులు సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో 30 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు.
సాంకేతిక అంశాలే మిన్న
డిప్లొమా విద్యార్థులు సాంకేతిక అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలి. ముఖ్యంగా తుది సంవత్సరం విద్యార్థులు సమయాన్ని వృథా చేస్తే అవకాశాలను చేజార్చుకొనే ప్రమాదం ఉంది. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తం 6,500 మంది ఉన్నారు. ఆన్‌లైన్ పాఠాలు వింటూనే సాంకేతిక అంశాలు, సబ్జెక్టుపై పట్టు సాధిస్తే ఆర్‌ఆర్‌బీ, ఏపీఎస్‌ఆర్టీసీ మెకానికల్ పోస్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ చేరాలనుకొనే విద్యార్థులు ఈసెట్‌కు సన్నద్ధం కావాలి.
పోటీ పరీక్షల్లో రాణించాలంటే
పదో తరగతి విద్యార్థులకు జూన్ 7 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు ఉంటాయా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి. గతేడాది పరీక్షలు లేకుండానే అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే అన్ని అంశాలపై పట్టు సాధించాలి. జిల్లాలో 52,500 మంది పది విద్యార్థులు ఉన్నారు. పది తర్వాత పాలిసెట్, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌టీఎస్‌ఈ, పలు గురుకులాల్లో ప్రవేశాలకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకుని తర్ఫీదు పొందాలి.
ఇల్లే విద్యాలయం కావాలి
విద్యార్థులు ఇంట్లోనే ఉండటంతో తల్లిదండ్రులే గురువులు కావాలి. చిన్నారులకు తెలియని అంశాలు చెప్పాలి. రోజు వారీ షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను సృజనాత్మకంగా ప్రోత్సహించడానికి వాట్సాప్ ద్వారా ప్రక్రియలు చేపట్టాలి. చేతిరాత, కథలు, లెక్కలు, సృజనాత్మక అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. బేసిక్స్ బాగా తెలిసిన చిన్నారులను 10 మందిని ఎంపిక చేసుకొని లిటిల్ టీచర్స్ పేరుతో కార్యక్రమాలు చేపట్టవచ్ఛు - జయచంద్ర, విషయ నిపుణులు
తల్లిదండ్రులే గురువులు
కరోనా వల్ల విషయ నిపుణుల విజ్ఞానం విద్యార్థుల చెంతకు లభిస్తోంది. నిత్యం బిజీగా ఉండే దిగ్గజాలు సైతం సమయం కేటాయించడంతో ఆన్‌లైన్‌లో ఏతరహా అంశాలైనా అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్ని లక్షలు వెచ్చించినా ఇలాంటి అవకాశం గతంలో దక్కేది కాదు. సక్రమంగా ఉపయోగించుకున్న వారే ముందుకెళతారు. కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్‌లు ఇంట్లో కూర్చొని తయారు చేయవచ్ఛు ఇళ్లే విద్యాలయం కావాలి. ఏఐసీటీఈ, దిగ్గజ కంపెనీలు, ఇతర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు లీడర్‌షిప్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఆంగ్ల నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడానికి యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. - ఆచార్య శశిధర్, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్
ఇదీ చదవండి: ‘బ్లాక్ ఫంగస్’ మందుల కొనుగోలుకు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ యత్నాలు