వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ దశభుజ గణపతి ఆలయంలో.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, పది చేతులు కలిగిన ఒకే రాతిలో మలచబడిన దశభుజ గణపతి భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చె ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు ఈ గణపతి. భక్తులు కోరుకున్న కోర్కెలు 41 రోజులలో తీరుతాయని ప్రగాఢ విశ్వాసం. 800 సంవత్సరాల క్రితం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయాల్లో.. దశభుజ గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది.
చవితి సందర్భంగా.. అర్చకులు మంత్రపుష్పాలతో, పవిత్ర జలాలతో గంగపూజ, పంచామృత అభిషేకము, రుద్రాభిషేకము, వివిధ రకాల పుష్పాలు, చెరుకుగడలు, మారేడు దళములు, గరికతో చక్కగా అలంకరించి మహా మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. భక్తులకు దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు.. భక్తులకు తాగునీరు వంటి వసతులు కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు.. దశభుజ గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Ganesh Chaturthi: నిరాడంబరంగా వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం