అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని కొజ్జేపల్లి వాగులో చెర్లోపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీరాములు వాగులో పడి మృత్యువాత పడ్డాడు. శ్రీరాములు ద్విచక్ర వాహనంపై పనిమీద గుత్తి వస్తుండగా వాగులో పడ్డాడు. కొంత దూరం వరద నీటిలో కొట్టుకుపోగా కొంతమంది స్థానికులు గమనించారు. వెంటనే వాగులోకి దిగి శ్రీరాములును బయటికి తీసుకువచ్చారు. బయటికి తీసుకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఆయన మృతి చెందాడు.
అందువల్లే అంతరాయం..
ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. గుత్తి చెరువు నుంచి మూడు ప్రదేశాల్లో మరువ కుంట పారుతుందని.. అందువల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా పోలీస్ బందోబస్తు నిర్వహించి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు నిలిపివేశామన్నారు. హైవే నుంచి వెళ్లే విధంగా ప్రణాళికను రూపొందిస్తామన్నారు.
మరమ్మతులకు కృషి..
ఇరిగేషన్ శాఖతో మాట్లాడి కోతకు గురైన రహదారి మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి... స్వామివారి రథాలను పరిశీలించారు.
ఇవీ చూడండి : 'బాపూజీ స్ఫూర్తితో పూర్తిస్థాయి రాజధానిని సాధిస్తాం'