అనంతపురం జిల్లా నుంచి రేషన్ బియ్యం కర్ణాటకకు అక్రమంగా తరలిపోతోంది. కరోనా వేళ... తెల్లరేషన్ కార్డుదారులందరికీ నెలవారీ కోటా రెట్టింపైంది. సాధారణంగా రేషన్ బియ్యాన్ని అన్నంగా వండుకునేవారు చాలా తక్కువ. దోశల పిండికి వినియోగిస్తారు. ఇప్పుడు అదనపు కోటా వస్తుండటంతో... చాలాచోట్ల రేషన్ దుకాణదారులే కార్డుదారుల వద్ద దొడ్డు బియ్యాన్ని కొనేస్తున్నారు. పాలిష్ చేయించి సన్నబియ్యంగా మార్చి కర్ణాటకలో విక్రయిస్తున్నారు. ఏడాదిగా రాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు పెద్దఎత్తున బియ్యాన్ని పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.
అనంతపురం జిల్లా నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం తరచుగా ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. మార్చి 16న నార్పల క్రాసింగ్ వద్ద 115 ప్యాకెట్లు, ఏప్రిల్ 27న చామలూరు క్రాస్ వద్ద మినీ లారీలో 70 ప్యాకెట్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 16న తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో నిల్వ ఉంచిన 160 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మే 28న సోమందేపల్లి వద్ద జాతీయ రహదారిపై 240 రేషన్ బియ్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. జూన్‌లో కర్ణాటక సరిహద్దు వద్ద పెద్దఎత్తున రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఈ నెల 2న ధర్మవరం నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని, ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 8న ఉరవకొండ నుంచి బెంగుళూరు తరలిస్తున్న 220 బస్తాల బియ్యం పట్టుకుని లారీని సీజ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9న ధర్మవరం నుంచి కర్ణాటకకు రవాణా చేస్తున్న14 టన్నుల రేషన్ బియ్యాన్ని సోమందేపల్లి జంక్షన్ వద్ద స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. 14వ తేదీన తాడిపత్రి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన 240 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా 12 లక్షల 23 వేల తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెలా 18వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యం హామీ ఆచరణలోకి రాకపోవటంతో.... దొడ్డు బియ్యాన్నే అందిస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు హోటళ్లకు, దళారులకు అమ్మేసుకుంటున్నారు. పౌరసరఫరాలశాఖ కఠిన చర్యలు తీసుకోకుంటే.... అక్రమ రవాణా ఆగదని వివిధ పార్టీల నేతలు అంటున్నారు.
ఇదీచదవండి