అనంతపురం చెక్ పోస్ట్‌లో ఎస్ఐ. రాజేష్, పోలీసుల బృందం తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐచర్ వాహనంలో ఉల్లిగడ్డలు సంచుల కింద 2400 కేజీల బరువుతో 80 బస్తాల్లో పొగాకును అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో 24 లక్షల 96 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా పలు అంశాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు.
వీరు కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్‌కు పొగాకు ఉత్పత్తులు తీసుకెళ్తున్నారు. గతంలో కూడా ఐచర్ వాహనంపై హైదరాబాద్‌లో కేసు నమోదై ఉన్నట్లు తెలియజేశారు. తుంకూర్ ప్రాంతంలో పోగాకు ఉత్పత్తిదారుడైన గుప్తాజి, హైదరాబాద్ సిటీలో ఉన్న డీలర్ దిలీప్, మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీలో ఉన్న డీలర్ అజయ్‌లను విచారించాల్సి ఉందని డీఎస్పీ పేర్కొన్నారు.