అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద 7.4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రూరల్ సీఐ ధరణి కిశోర్, చిలమత్తూరు ఎస్సైల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచి ఎత్తుకొని వెళుతుండగా పోలీసులు అతన్ని ఆపి సంచిని తనిఖీ చేశారు. సంచిలో ఉన్న 7.4 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు.. సంచిని స్వాధీనం చేసుకుని అతణ్ని అరెస్టు చేశారు.
బెంగళూరుకు చెందిన మహబూబ్ నౌమన్ ఉమార్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుణె నుంచి గంజాయి అక్రమంగా తీసుకొచ్చి సోమందేపల్లి పారిశ్రామికవాడలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి, నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా పట్టివేత..ఇద్దరు అరెస్టు