Satyakumar challenged to CM Jagan: రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకే కేంద్ర విద్యాసంస్థ ఉండగా ఇప్పుడు 25 సంస్థలు ఏర్పాటు చేశామని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అనంతపురంలో నిర్మాణ దశలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సత్యకుమార్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మించటానికి సిద్ధంగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూములు కేటాయించటంలేదని సత్య కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయటం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు.. ఇంకా ఎంతో మందికి ఉపాధి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. వాటికి భూములివ్వకుండా తోలుమందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం.. దేశవ్యాప్తంగా పద్నాలుగు ఎకనమిక్ ఇన్వెస్ట్మెంట్ జోన్లు ఇవ్వగా, అందులో రాష్ట్రానికే రెండు ఇచ్చినట్లు ఆయన అన్నారు. దీని వల్ల తొంబై వేల కోట్ల పెట్టుబడుల రావటమే కాకుండా ఎనిమిది లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. వీటి ఏర్పాటుకు భూములు కేటాయించటంలేదని అవసరం లేనటు వంటి వాటికి లక్షల ఎకరాల భూమి కేటాయిస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు. అభివృద్ధి విషయంలో ఏమి చేశారో బహిరంగ చర్చకు రావాలని సత్యకుమార్ సవాల్ చేశారు. కర్నూలులో హైకోర్టు నిర్మాణానికి భూమి గుర్తించాలని కనీసం కలెక్టర్‌కు కూడా ఆదేశాలివ్వలేదంటే ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తెలుస్తోందని నిలదీశారు. రాయలసీమ ప్రజలు తెలివితక్కువ వారు కాదని త్వరలోనే మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని అన్నారు.
వైసీపీ నాయకులు అబద్దాలు చెప్పడంలో నిష్ణాతులు.. రాష్ట్రానికి రాజధాని లేదని.. దాని గురించి ప్రజలు అన్నిచోట్లా మాట్లాడుతున్నారని.. దీనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిగ్గుపడాలని సత్యకుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. హైకోర్టును మార్చాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ అని దానికి కనీసం ప్రతిపాదనలే పంపకుండా ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. అధికార వైసీపీ నాయకులు అబద్దాలు చెప్పడంలో నిష్ణాతులని.. జగన్ మోహన్ రెడ్డి తన చుట్టూ ఎప్పుడూ తోడేళ్ల మందను పెట్టుకున్నారని అన్నారు.
- ALSO READ: 'చెయ్యాలి చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ' సినిమా డైలాగ్‌ను జగన్ పాటిస్తున్నారు: సత్యకుమార్
వైసీపీలో ఉన్న నాయకులంతా పలు పార్టీలు మారి వచ్చివారేనని.. రేపు జరిగే ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోతుందంటే మంత్రులతో సహా ఉన్న నాయకులందరు మరో పార్టీలోకి వెళ్తారని సత్యకుమార్ చెప్పారు. నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది పనుల గురించి చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీ నాయకులకు ఎందుకని ఆయన ప్రశ్నించారు.