RTC Bus Trouble: అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ అధికారులు మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపించారు. రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఆర్టీసీ బస్సుకు అధికారులు కనీస నిర్వహణ చేయకపోవటంతో తరుచూ ఎక్కడికక్కడ ఆగిపోతూ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సోమవారం బళ్లారి నుంచి ఉరవకొండకు ప్రయాణికులతో వచ్చిన బస్సు ఉరవకొండ పట్టణంలోని 42వ జాతీయ రహదారిపై అర్దాంతరంగా అగిపోయింది. యాక్సిలేటర్ సమస్య తలెత్తిందని, తానేమీ చేయలేనని డ్రైవర్ నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు కిందకు దిగి రహదారి మధ్యలో నిలిచిపోయిన బస్సును తోసి స్టార్ట్ కావటానికి సహాయపడ్డారు.
అందరూ కలిసి ప్రయత్నించినా బస్సు ఇంజన్ స్టార్ట్ కాలేదు. దీంతో చేసేదేమీలేక మహిళా కండక్టర్ సలహా మేరకు ప్రయాణికులంతా ఉరవకొండలోకి నడిచి వెళ్లారు. పలువురు ప్రయాణికులు లగేజీతో నడిచి వెళ్లలేక చాలా ఇబ్బంది పడ్డారు. యాక్సిలేటర్ పని చేయకపోవడంతో ఆగిపోయిందని డ్రైవర్ తెలిపారు. ప్రయాణికులంతా వెళ్లిపోయాక బస్సును ఉరవకొండ డిపోకు తరలించారు.
ఇవీ చదవండి: