అనంతపురం జిల్లా కొత్తచెరువు రహదారి మరమ్మతు పనులు హడావుడిగా మొదలయ్యాయి. ఇక్కడ అక్టోబరు 2న తమ పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పడంతోనే ఇవి జరుగుతున్నాయని చర్చ మొదలైంది. ధర్మవరం- పుట్టపర్తి రోడ్డులో ఇళ్ల నుంచి వెలువడే మురుగు, వర్షపునీరు చేరుకోవడంతో తారు రోడ్డు దెబ్బతిని గోతులు ఏర్పడ్డాయి. అధ్వానంగా మారిన రోడ్లకు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేదంటే శ్రమదానంతో మరమ్మతులు చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ కొత్తచెరువు పర్యటన ఖరారు కావడంతో మంగళవారం ఉదయాన్నే ఆర్‌అండ్‌బీ అధికారులు, గుత్తేదారు సందీప్ థియేటర్ ఎదురుగా దెబ్బతిన్న తారు రోడ్డు పనులను ప్రారంభించారు. గోతులను చదును చేసి, కంకర తరలించి రోలర్‌తో గట్టిపరిచారు. మామిళ్లకుంట నుంచి కొత్తచెరువు మార్కెట్‌యార్డు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు నెలరోజుల కిందటే రూ.2.5 కోట్లతో ఖరారయ్యాయని స్థానిక వైకాపా నాయకులు తెలిపారు. వెంటనే పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి గుత్తేదారును ఆదేశించడంతో ఇప్పుడు పనులు ప్రారంభించినట్లు వివరించారు. పవన్ పర్యటనతోనైనా.. తమ ప్రాంతంలో రోడ్లు బాగుపడున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: