అనంతపురం జిల్లాలో రోడ్లన్నీ పాడయ్యాయి. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి మూడు శాఖల పరిధిలో ఉంటుంది. జిల్లాలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో 170 కిలోమీటర్ల మేర హైదరాబాద్-బెంగుళూరు 44వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. స్టేట్ హైవే పరిధిలో జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రహదారులుండగా, రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ పరిధిలో 2680 కిలోమేటర్ల రోడ్లున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలో 10,650 కిలోమీటర్లు ఉన్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులు, వివిధ కాలనీల రోడ్లు కలిపి 556 కిలోమీటర్లు, హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 280, మిగిలిన ఏడు పురపాలక సంస్థల పరిధిలో 2111 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి.
కలెక్టర్ తిరిగే రహదారి పాడైంది
జిల్లా కేంద్రం నుంచి కదిరి, చెన్నై నగరాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారికి అధికారులు కనీస మరమ్మతులు కూడా చేయటంలేదు. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చెరవుకట్టపై నుంచి బీకేఎస్ మండలానికి వేళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రతిరోజూ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వాహనాల్లో తిరిగే ఈ రహదారికి కూడా కనీస మరమ్మతులు చేయటంలేదంటే నిర్లక్ష్యం ఎంతుందో తెలుస్తోంది.
వీళ్లేప్పుడు పట్టించుకుంటారో..!
పెద్ద వడుగూరు మండలంలో జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి వర్షాలకు కొట్టుకపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేయటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి, గుంతకల్లు మండలాల్లో పట్టణాలను కలిపే పలు రోడ్డు పాడైంది. కదిరి మున్సిపాలిటి పరిధిలో నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాని రహదారి పూర్తిగా దెబ్బతింది. హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిపై మోతుకపల్లి వద్ద పెన్నానదిపై ఉన్న వంతనపై రహదారి అధ్వానంగా మారింది. అసలే ఇరుకుగా ఉన్న వంతెనకు తోడు, రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణం పావుగంట ఆలస్యమవటమే కాకుండా, వాహనాలు పాడైపోతున్నాయి.
సరిహద్దు ప్రాంతాలలో అస్సలేం చెప్పలేం..!
రాష్ట్రానికి చివరగా ఉండే మడకశిర మండలం తొలి నుంచి అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. అది కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావటంతో రహదారుల గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. మడకశిర మండలంలో కర్ణాటక సరిహద్దులోని ఎర్రబొమ్మనహళ్లి గ్రామానికి 30 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఆనవాళ్లే కోల్పోయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడ నరసింహస్వామి ఆలయంలో ఏటా పెద్దఎత్తున నిర్వహించే భూతప్పల ఉత్సవానికి వేలాదిగా భక్తులు హాజరవుతుంటారు.. మడకశిర-పెనుకొండకు వెళ్లే రహదారి సైతం ఈమధ్యన కురిసిన కుండపోత వానలతో గుంతలేర్పడ్డాయి. కర్ణాటక నుంచి నిత్యం పెట్రోల్, డీజల్ రవాణా చేస్తూ ఈ మార్గంలో రోజూ వందకు పైగా ట్యాంకర్లు తిరుగుతుంటాయి. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవటంతో ఈ మధ్య కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు నిల్వఏర్పడి, ఈ భారీ వాహన రాకపోకలతో రోడ్డంతా అధ్వానంగా మారింది.
గుంతల వల్లే అధిక ప్రమాదాలు..
గుంతలు ఏర్పడిన రహదారుల్లో ప్రయాణించటం చాలా ప్రమాదకరమని కీళ్లు,ఎముకల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులకు డిస్క్ ఎముక సమస్యలు వస్తాయంటున్నారు. దెబ్బతిన్న రహదారులపై దుమ్ము, ధూళి కళ్లలో పడటంవల్ల ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారులపై గుంతలున్న చోటనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ మధ్యన పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలకు కూడా గుంతలే కారణమని స్పష్టమైంది. ఈ రోడ్లలో ప్రయాణించి అనారోగ్య సమస్యలతో వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: