Road Accident in Anantapur : వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలిలోనే దుర్మరణం చెందగా ఓ మహిళ, బాలుడు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కొలువైన అమ్మవారిని ఆ కుటుంబం దర్శించుకొని మొక్కు తీర్చుకుంది. అంతా తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నారు. అరగంటలో అంతా ఇళ్లకు చేరాల్సి ఉంది. అంతలోనే మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చింది. ఆరుగురిని కబళించింది. రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన సోమవారం అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో చోటు చేసుకుంది. బాధిత బంధువులు, పోలీసుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలం పడమటికోడిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తన భార్య రూప, కూతురు రశ్మిత, కుమారుడు రాముతో కలిసి రెండ్రోజుల కిందట కర్ణాటక ప్రాంతంలోని హులిగిలో అమ్మవారి దర్శనానికి వెళ్లారు. వీరు సొంత ఆటోలో రాయదుర్గం వరకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో హులిగి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని సోమవారం ఉదయం రాయదుర్గం వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో పూలకుంట వద్ద నాగమ్మ, ఆమె కూతురు లక్ష్మీ, మనవడు మహేంద్రను ఎక్కించుకున్నారు. అరగంటలో గమ్యం చేరాల్సి ఉండగా గుమ్మఘట్ట మండలం పూలకుంట-గోనబావి గ్రామాల మధ్య కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొని మూడు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాజశేఖర్(25), రశ్మిక(5), నాగమ్మ(60) మహేంద్ర(8) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ(35)ని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. రాము(6) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. రూప, కారు యజమాని, వైకాపా నాయకుడు ప్రతాప్‌రెడ్డి గాయపడ్డారు.
బస్సు వచ్చుంటే మూడు ప్రాణాలు నిలిచేవి..
ముప్పలకుంట గ్రామానికి చెందిన నాగమ్మ కూతురు, మనవడుతో కలిసి ఐదుకల్లు గ్రామానికి వెళ్లేందుకు పూలకుంట బస్టాండుకు వచ్చింది. ఆర్టీసీ బస్సు కోసం రెండు గంటలు నిరీక్షించారు. రాకపోవడంతోనే చివరికి ఆటోను ఆశ్రయించి ప్రాణాలు కోల్పోయారు. పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోందని, ఈక్రమంలో ప్రమాదం బారిన పడుతున్నట్లు గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల బంధువుల ఆందోళన..
గుమ్మఘట్ట ప్రమాద కారకుడు ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని.. రాయదుర్గం ఆస్పత్రి ఎదుట మృతుల బంధువుల ఆందోళన చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని, తమకి న్యాయం జరిగేవరకు మృతదేహాలు తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకి మద్దతుగా తెదేపా నేత కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న మృతుల బంధువులపై పోలీసులు చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదీ చదవండి: CBN TWEET: అంబేడ్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శ ప్రాయమే..!