అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,600 మంది వరకు ఆర్‌ఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకపోయినా క్యాన్సర్ వ్యాధి మొదలు శస్త్రచికిత్సల వరకు వైద్యం అందిస్తూ.. రోగుల ప్రాణాలమీదకు తెస్తున్నారు. చాలామంది తెలిసీతెలియని వైద్యంతో ప్రాణాలు తీస్తున్నారు. ప్రస్తుతం కరోనాకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై అవగాహన లేని ఆర్‌ఎంపీలు గ్రామీణులను తప్పుదోవ పట్టిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చిన గ్రామీణులకు సాధారణ మందులు ఇచ్చి ఇంటి వద్దే ఉండాలని చెబుతున్నారు. వీరిమాట విని నాలుగైదు రోజులపాటు మందులు వాడిన రోగులకు జలుబు, దగ్గు తగ్గకపోగా వైరస్ ఊపిరితిత్తులనిండా విస్తరిస్తోంది.
ప్రాణాల మీదకొచ్చాక పరుగులు
ఆర్‌ఎంపీల వైద్యంతో కరోనా వైరస్ రోగులను మరింత ప్రమాదంలో పడేస్తోంది. రక్తంలో ఆక్సిజన్ శాతం, పల్స్ రేటు వంటివి చూడకుండా వైద్యం చేస్తున్నారు. రోగులకు కనీస జాగ్రత్తలు చెప్పకుండా మందులు కొనిపించి, మూడు లేక ఐదు రోజులు వాడాలని పంపుతున్నారు. ఫలితంగా బాధితుల్లో వైరస్ పెరిగిపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు వస్తున్నారు. వైరస్ నాలుగో స్థాయిలోనే, ఐదోస్థాయికి చేరాకనో ఆసుపత్రికి వెళ్లడం వల్ల ఆక్సిజన్ తప్పనిసరవుతోంది. జిల్లా కేంద్రంలోని కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల కొరత తీవ్రంగా ఉంది. విషమ పరిస్థితుల్లో వచ్చే బాధితులకు వైద్యం అందించేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం.
వైద్యశాఖ చర్యలేవీ?
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందల మంది కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకునే నాథుడే కరవయ్యారు. శింగనమల మండలంలో నాలుగు రోజుల కిందట పర్యటించిన జేవీవీ ప్రతినిధి డాక్టర్ గేయానంద్ గ్రామాల్లో కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒక్క మండలంలోనే పలు గ్రామాల్లో ప్రజలు కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఆర్‌ఎంపీలు కొవిడ్‌కు చికిత్స చేయడం ప్రమాదకరమని ఆయన తెలిపారు.
మా దృష్టికి వచ్చింది
ఆర్‌ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్సలే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్యం చేయకూడదు. చాలా గ్రామాల్లో ఆర్‌ఎంపీలు కొవిడ్ బాధితులకు మందులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మా మెడికల్ ఆఫీసర్ల ద్వారా వారిని హెచ్చరించాం. రాయదుర్గంలో ఓ ఆర్‌ఎంపీ రోజూ 150 మంది వరకు కొవిడ్ లక్షణాలున్న రోగులను చూస్తున్నట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్‌కు వైద్యం చేసే ఆర్‌ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ సిరి ఆదేశాలిచ్చారు. - డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్‌ఓ
ఇదీ చదవండీ.. సిక్కు స్నేహితునికి.. అంత్యక్రియలు చేసిన ముస్లింలు