Millet Food Consumption: అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు మనం తీసుకునే ఆహారంపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించాయి. వ్యాధులపై ఆహారం ప్రభావం ఎంతమేర ఉంటుందనే విషయంలో 30 రోజులపాటు మిల్లెట్ ఆహారంతో పరిశోధన నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ విభాగాల వైద్య నిపుణులు, క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి తృణధాన్య సాగుపై పనిచేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనపై మహిళలను నడిపిస్తున్న సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి.
అనంతపురం గ్రామీణ మండలం కురుగుంటలో సర్వే నిర్వహించి వివిధ వయసులకు చెందిన 31 మందిని ఎంపిక చేశారు. వీరిలో 26 మంది దీర్ఘకాలిక చక్కెర వ్యాధిగ్రస్తులు కాగా, ఐదుగురు బీపీతో బాధపడుతున్న వారున్నారు. వీళ్లందరికీ తృణ ధాన్యాలతో వండిన ఆహారాన్ని మూడు పూటలా మెనూ ప్రకారం అందించారు.
మిల్లెట్ ఆహారం అందించే ముందురోజు ఆందరికీ షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. నెల రోజుల వ్యవధిలో మధ్యలో నాలుగు సార్లు చక్కెర వ్యాధి, బీపీ పరీక్షలు నిర్వహిస్తూ నమోదు చేశారు. క్రమంగా బీపీ, షుగర్ వ్యాధి స్థాయిలు తగ్గుతుండటాన్ని వైద్యులు గుర్తించారు. ఈ నెల 21వ తేదీతో ఆహారం అందించే పరిశోధన పూర్తికావటంతో అందరికీ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు మినహా అందరికీ చక్కెర వ్యాధి, రక్తపోటు పూర్తిగా అదుపులోకి వచ్చిందని వెల్లడించారు.
పరిశోధనలో పాల్గొన్న వారిలో ఇద్దరు మాత్రం మధ్యలో వివాహానికి వెళ్లి అక్కడ ఇతర పదార్థాలు తినటం వల్ల షుగర్ వ్యాధి తగ్గినా, సాధారణ స్థాయికి రాలేదని.. మిగిలిన వారందరికీ అదుపులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా పరిశోధనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరిన్నిచోట్ల నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఆర్డీటీ సంస్థ తన వంతు సహకారం అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
ఇవీ చదవండి: