Red sandalwood logs Seized : శేషాచలం అడవుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 5 నెలల కాలంలో నాలుగవ సారి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ వెల్లడించారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద శనివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే 38 ఎర్రచందనం దుంగలతోపాటుగా రవాణాకు ఉపయోగించిన ఒక లారీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ వివరించారు.
కడప జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు రియాజ్ పట్టుబడగా..మరో నలుగురు పరారయ్యారని తెలిపారు. తప్పించుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు తమ రవాణా మార్గాన్ని అనంతపురం జిల్లా వైపునకు మళ్లించారని విచారణలో వెల్లడైందని వివరించారు. కొడికొండ చెక్ పోస్టు మీదుగా కర్ణాటక, తమిళనాడు అటు నుంచి విదేశాలకు తరలిస్తుండటంతో కొడికొండ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల నిఘా పెంచామని తెలిపారు.
ఇదీ చదవండి : News MLC's met Governor : గవర్నర్ ను కలిసిన.. నూతన ఎమ్మెల్సీలు