కొండవీడు రైలులో నుంచి దివ్యశ్రీ అనే గర్భిణిని తోసేసి నగలు దోచుకెళ్లిన వేలాయుధం రాజేంద్రన్ అనే ముద్దాయికి అనంతపురం జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2018 డిసెంబరు 18న గుంటూరుకు చెందిన దివ్యశ్రీ విజయవాడ నుంచి బెంగళూరుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అనంతపురం దాటిన తర్వాత రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెను బోగీ నుంచి కిందకు తోసివేయడంతో పాటు తానూ కిందకు దూకేశాడు.
బాధితురాలిని ముళ్లపొదళ్లలోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. బలంగా కిందకు తోసివేయడంతో అక్కడే ఆమెకు గర్భస్రావం జరిగింది. అనంతరం పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించడంతో కోలుకున్నారు. జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చెన్నై సమీపంలోని తిర్‌విర్‌కాడ్ గ్రామానికి చెందిన వేలాయుధం రాజేంద్రన్‌గా గుర్తించారు. 2019 జనవరి 2న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటినుంచి జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.
ఇదీ చదవండి: Inter results: నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల