రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు రోడ్డుపై నల్లజెండాలతో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు ధోరణితో వైకాపా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం అప్రజాస్వామికమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇది భారత దేశంలోనే చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. దీనివల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడిపోయిందన్నారు.
మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ ధర్మవరంలో పలువురు ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులపై పోలీసుల లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కమతం కాటమయ్య అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినాదాలు చేశారు. గాంధీనగర్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజలను హింసించే రాజులా తయారయ్యారని అనంతపురంలో వడ్డెర్ల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మురళి మండిపడ్డారు. రైతులు, మహిళలు ఆందోళన చేస్తుంటే దారుణంగా వారిని హింసించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దీనికి ఫలితం అనుభవిస్తారని తెలిపారు.
తనను బయటకు వెళ్లనీయకుండా మూడు రోజుల నుంచి నిరంకుశత్వంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కళ్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. తమ ఆందోళను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :