వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలను ఇబ్బందులు పెట్టొద్దని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అసలే కరోనా ప్రభావంతో విధించిన లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులను పోలీసులు చలాన్ల రూపంలో మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. అనంతపురం జిల్లాలోనే లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు రూ.5 కోట్లు చలాన్లు వసూలు చేయడం గమనార్హం.
కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోలేదు
కలెక్టర్ గంధం చంద్రుడు సూచన మేరకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులను సైతం పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారు. పంట కొనుగోలు చేసి జిల్లా దాటి వెళ్లే వాహనాలను గంటల తరబడి నిలిపివేయటంతో కర్నూలు జిల్లాకు చెందిన బత్తాయి వ్యాపారులు కొందరు వెనక్కు వెళ్లిపోయారు. పంట ఉత్పత్తులు తరలివెళ్లే వాహనాలను ఎక్కడా నిలపవద్దన్న ఆదేశాలను అనంత పోలీసులు ఎక్కడా ఖాతరు చేయలేదు. ఎడాపెడా చలాన్లు రాసేసి కోట్ల రూపాయలతో ఖజానా నింపేశారు. జిల్లాలోని సీకే పల్లిలో వారం రోజుల్లో ఓ రైతుకు రెండుసార్లు పోలీసులు జరిమానా విధించారు. మూడోసారి కూడా చలానా సొమ్ము చెల్లించాలని ద్విచక్రవాహనం నిలిపివేయటంపై సహనం కోల్పోయిన రైతు ఆవేదన వైరల్ అయ్యింది.
చిరు వ్యాపారులను పిండేశారు
లాక్డౌన్లో వాహనచట్టం అతిక్రమించిన, వసూలు చేసిన చలాన్ల వివరాలను అనంతపురం పోలీసులు విడుదల చేశారు. దాదాపు ఐదు కోట్ల రూపాయల చలాన్లు వసూలు చేయగా.. అందులో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లే వాహనాలు, ద్విచక్రవాహన రైతుల నుంచి వసూలు చేసిన జరిమానాలు కూడా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల విక్రయాలకు అనుమతిచ్చిన పోలీసులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కిరాణ, చిరు వ్యాపారులను చలాన్లతో పిండేశారు. ఈ దోపిడీని తట్టుకోలేక చిన్న చిన్న వ్యాపారులు నగరానికి వచ్చి సరుకులు తీసుకెళ్లటమే మానేశారు. గ్రామాల్లో సరుకులు దొరక్క.. సమీపంలోని నగరాలు, పట్టణాల్లో కొనుగోలు చేద్దామని రోడ్ల మీదకు వచ్చిన రైతులు, గ్రామీణులను పోలీసులు చలాన్లతో బాదేశారు.
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చూడండి..