రాప్తాడు సమీపంలోని పండమేరు నది ఒడ్డున పండమేటి రాయుడు స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి వందల కోట్లు విలువైన భూములు ఉన్నా.. ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన ఈ భూమిని 20 ఏళ్లపాటు ఏపీఐఐసీకి లీజుకు ఇచ్చారు. మూడేళ్లకోసారి పది శాతం లీజ్ ధర పెంచాలని ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఏటా 4 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. కానీ పర్వదినాల్లో పూజల నిర్వహణకూ ఆలయానికి డబ్బులు అందటం లేదు.
అనంతపురం నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నది పక్కనే ఉన్నందున పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ... సీసీ రోడ్లు వేసి, ఆలయం వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఉద్యానవనం ప్రస్తుతం ముళ్లపొదలతో నిండిపోయింది. గ్రామస్తులే ముందుకు వచ్చి కోనేరు అభివృద్ధి చేసినా... అధికారులు దాని నిర్వహణ గాలికొదిలేశారు. ఆలయానికి సున్నం వేయటానికి కూడా దాతల సాయం కోరుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆలయ పూజారికి వేతనం ఇవ్వటం కూడా కష్టంగా మారిందని ధర్మకర్తల మండలి సభ్యుడు పేర్కొన్నారు.
పండమేటి రాయుడు స్వామి వారి ఆలయ అభివృద్ధికి దేవదాయశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవీచదవండి.