Pamidi Garment Industry : చిన్నారులు, మహిళల వస్త్ర వ్యాపారంలో పామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తూకాల్లో వస్త్రాల అమ్మకానికి ఇక్కడ పెట్టింది పేరు. ఇప్పటికే కరోనా రాకతో వస్త్ర పరిశ్రమ అతలాకుతలమవ్వగా... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వ్యాపారులకు గుదిబండలా మారింది. గార్మెంట్ పరిశ్రమపై విధించిన 5 శాతం జీఎస్టీ 12 శాతానికి పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పత్తి ధర సైతం రెట్టింపు కావడంతో గుజరాత్, అహ్మదాబాద్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు క్లాత్‌పై ధరలు అమాంతం పెంచాయి. ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టడంతో వస్త్ర దుకాణాలు మూసివేసే పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు.
" నైటీకి 20-30 రూపాయలు ఇప్పటికి పెరిగింది. పదివేల రూపాయల డ్రస్సు తయారు చేస్తే ఇంకెంత పెరుగుతాయి. నైటీల వ్యాపారం ఇప్పటికే కుదేలైంది. ఇంకా పెరుగుతుందంటున్నారు. వ్యాపారాలు చేయలేక దుకాణాలు మూతబడుతున్నాయి." - రామాంజనేయులు, దుస్తుల తయారీదారు
" ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న పామిడి మార్కెట్ విలవిలలాడటానికి కారణం జీఎస్టీ. జీఎస్టీ ఐదు శాతం అన్నప్పుడే ఈ వ్యాపారం కుదేలైంది. ఇప్పుడు 12శాతం పెట్టడం వలన వ్యాపారస్తులు దుకాణాలన్నింటిని మూతవేసి కూలీలుగా మారాల్సిన రోజులు వస్తాయి. జీఎస్టీ పెంపుతో ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ గార్మెంట్ వ్యవస్థను సర్వనాశనం చేయవద్దని కోరుతున్నాం. " - హాజీ రుక్మాన్, గార్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి : Review On Corona Cases : బెంభేలెత్తిస్తోన్న కరోనా పాజిటివిటీ రేటు..పడకలను పెంచుతోన్న ఆసుపత్రులు
" వ్యాపారమనేదే లేదు. ఇక్కడ కూడా రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఇక నుంచి అమ్ముకోవడానికి మాకు ఏం గిట్టదు. ఇక్కడ నుంచి ఆటోలో పక్కన గ్రామాలకు వస్త్రాలు తీసుకువెళ్లి అమ్ముతాము. ధరలు పెరగటంతో ఆటో ఛార్జీలకే అవుతాయి. మాకేమి మిగలదు. " - అనుసూయ, చిరువ్యాపారి
పామిడిలో సుమారు 280 దుస్తుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. దాదాపు 10 వేల మందికిపైగా వస్త్ర కటింగ్ మాస్టర్లు, దర్జీలు పని చేస్తూ మహిళలు, పిల్లల దుస్తులు కుడుతున్నారు. దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాలకు ఇక్కడ నుంచే వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ విక్రయించుకునే చిరు వ్యాపారులకు పామిడి పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తోంది. సజావుగా సాగుతున్న వీరి జీవితాల్లో తాజా పరిస్థితులు పెను ప్రభావమే చూపాయి. లాక్‌డౌన్‌కు ముందు తయారు చేసిన దుస్తులు విక్రయాలు లేక దుకాణాల్లోనే గుట్టలుగా పడిఉన్నాయి. వ్యాపారం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి... దర్జీలకు వేతనాలు ఇవ్వలేక దుకాణాలు మూసివేసే పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : CP Special Focus On Blade Batch : బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా బెజవాడ...సీపీ ప్రత్యేక దృష్టి...
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!