పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. అనంతపురం జిల్లాలోని 14 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది.
తొలి దశలో కదిరి డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 12 మండలాల్లో 169 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 1,714 వార్డులు ఉన్నాయి. నామపత్రాల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారంతో గడువు ముగుస్తుంది. అయితే మొదటిరోజు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. రెండోరోజు నుంచి నామినేషన్లు జోరందుకోనున్నాయి. తొలిరోజు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.