ఏటా అనంతపురం జిల్లాలో రబీలో లక్ష హెక్టార్లలో పప్పుశనగ సాగవుతోంది. సుమారు 75 వేల క్వింటాళ్ల విత్తు అవసరం ఉంది. గతంలో అవసరం మేరకు పంపిణీ చేసేవారు. ఈసారి రాయితీ, కేటాయింపులు తగ్గించేశారు. దీంతో గోదాముల నుంచి నిల్వలు కదల్లేదు. గ్రామ, మండల గోదాముల నుంచి పప్పుశనగ బస్తాలను తెచ్చుకునేందుకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

నిబంధనలతో బేజారు
రాయితీ ధరతో పప్పుశనగ విత్తనం పొందాలంటే తొలుత రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. పలు పత్రాలు సమర్పించాలి. అందులో ఏ మాత్రం తేడా ఉన్నా నిబంధనలు అడ్డుతగులుతున్నాయి. మరోసారి విత్తనం కోసం ఆర్‌బీకేలకు వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపే పొలంలో తేమ ఆరుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే విత్తు కోసం ఎదురుచూడకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు.
ధరల్లో తేడా లేదు
రాష్ట్ర ప్రభుత్వం పప్పుశనగ విత్తనానికి 40 శాతం నుంచి 30 శాతానికి రాయితీ తగ్గించింది. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్ ధర రూ.7,500. అందులో రాయితీ రూ.2,250 పోగా.. రైతు వాటా రూ.5,250 చెల్లిస్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.5,200-5,300 పలుకుతోంది. రాయితీతో పెద్దగా ప్రయోజనం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
ఒక్క రోజే గడువు
జిల్లాలో 26 మండలాల్లోని 212 రైతు భరోసా కేంద్రాల్లో రాయితీతో పప్పుశనగ విత్తన పంపిణీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు సరఫరా బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 9న ఆర్‌బీకేల్లో రైతు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 13వ తేదీ పంపిణీ మొదలైంది. బుధవారం నాటికి పరిశీలిస్తే.. ఒక్కో కేంద్రంలో పట్టుమని పదిమంది రైతులు కూడా విత్తనం కొనుగోలు చేయలేదని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రైతుల నుంచి ఎక్కడా స్పందన కనిపించలేదు. పంపిణీ ప్రక్రియ గురువారంతో ముగియనుంది.
డిమాండు తగ్గింది
ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిశాయి. విత్తన కేటాయింపులు తక్కువ వస్తాయని భావించాం. అయితే రాయితీ పప్పుశనగ విత్తనానికి డిమాండు బాగా తగ్గింది. రైతుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. గతేడాది రబీలో 67 వేల క్వింటాళ్లు పంపిణీ చేశాం. ఈసారి కనీసం 20 వేల క్వింటాళ్లు కూడా అమ్మలేదు. రాయితీ తగ్గించడం, పంట మార్పిడి ప్రధాన కారణమని తెలుస్తోంది. - సుబ్రహ్మణ్యం, జిల్లా మేనేజర్, ఏపీసీడ్స్
ఇదీ చదవండి :