అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం రాత్రి విధులకు గైర్హాజరైన వైద్యురాలు సుకన్యను సస్పెండ్ చేయాలని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సోమవారం ఉన్నతాధికారులకు హుకూం జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో తాగునీటి విషయంలో జరిగిన ఘర్షణలో వైకాపాకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు మంత్రి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు సమస్యలు, వైద్యశాలకు వచ్చిన వారికి చికిత్స అందించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్ సుకన్యను సస్పెండ్ చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.
రాత్రి రోగులకు చికిత్స అందించినప్పటికీ వైద్యులపై మంత్రి మండిపడడంతో వైద్యురాలు సుకన్య కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటనపై వైద్యశాల సూపరింటెండెంట్ బాబా బుడేన్ మాట్లాడుతూ... పెనుకొండ వైద్యశాలలో 6 మంది వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా.. వైద్యుల కొరత కారణంగా కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. అన్ని సమస్యలను అధిగమించి ప్రగతి సూచికలో జిల్లాలో 13వ స్థానంలో ఉన్న వైద్యశాలను తమ కృషితో రెండో స్థానంలోకి తీసుకువచ్చామన్నారు. అయినా వైద్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: