కారు అద్దెకు పెట్టుకుంటామని వాహన యజమానులను నమ్మించిన ఓ వ్యక్తి.. వారి వద్దే మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. ఏకంగా 2.5 కోట్ల రూపాయలతో పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది.
తీసుకున్న అడ్వాన్స్‌తో పరార్..
పెనుకొండ మండలంలోని అమ్మవారి పల్లి గ్రామ సమీపంలో అమ్ము ప్రియా ట్రావెల్స్‌లో కార్లు, బస్సులు, సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్లు అద్దెకు పెట్టుకుంటామని వెంకటేశ్ అనే వ్యక్తి వాహన యజమానులను నమ్మించాడు. దాదాపు 150 మంది బాధితుల నుంచి వాహనాలు అద్దెకు తీసుకున్నాడు. నిర్వహణ కోసమని వాహన యజమానితో ముందుగానే రూ.15500, రూ.18వేలు అడ్వాన్సు తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నెల నుంచి తానే డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. మూడు నెలలు గడిచినా వాహనాలకు అద్దె చెల్లించలేదు.
మార్కెట్ ధరకంటే తక్కువకే కార్లు ఇప్పిస్తానని..
మరి కొందరితో మార్కెట్ రేటు కన్నా కియా కారు తక్కువ ధరకే ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నుంచి ట్రావెల్స్ యజమాని కనిపించకుండా పోవడంతో వందల సంఖ్యలో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సుమారు 150 మందికి పైగా మోసపోయారని సమాచారం. ఘటనపై కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్సై వలిబాషను వివరణ కోరగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. పరారీలో ఉన్న ట్రావెల్స్ యజమాని వెంకటేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
Aadhar: ఆధార్‌లో మార్పులకు తప్పని తిప్పలు.. గంటల తరబడి ఎదురుచూపులు