తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాసనమండలి రద్దు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీకి ప్రధాన మార్గం నుంచి కాకుండా వేరే మార్గంలో వచ్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు గౌరవం ఇచ్చే పార్టీ వైకాపా అని గొప్పలు చెప్పేవారు... శాసన మండలి ఛైర్మన్ షరిఫ్ను దుర్భాషలాడారని ఆరోపించారు.
కర్నూలుకు హైకోర్టు ప్రకటించి రాయలసీమ ప్రజలను మోసగించారని తిప్పేస్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధానిగా ఒక ప్రాంతాన్నే చెప్పాలనీ, 3 ప్రాంతాలు చెప్పటం ఎక్కడా లేదని పేర్కొన్నారు. విశాఖలో రాజధాని వద్దని ఆ ప్రాంత ప్రజలు తిరస్కరిస్తున్నా... అక్కడ రాజధాని పెట్టటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. రాయలసీమలో రాజధాని పెడితే తాము హర్షిస్తామన్నారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ఆస్తులు పెంచుకునేందుకే వైకాపా, తెదేపా నేతల ప్రయత్నం'