రూ.300 కోట్ల మేర నిల్వ
మదనపల్లెలో మాస్టర్ వీవర్స్ 400 మంది వరకు ఉన్నారు. వ్యక్తిగతంగా నేసే వారు 3వేల మంది ఉంటారు. ధర్మవరంలో మాస్టర్ వీవర్స్ 800 మంది, సొంత మగ్గంపై నేసేవారు 5 వేల మంది ఉన్నారు. సాధారణంగా వీరంతా నెలకు సరిపడా ముడిసరకు ముందుగానే తెచ్చుకుంటారు. మార్చిలో పండగలు, ఏప్రిల్, మే, జూన్‌లో వివాహాలు ఉంటాయని ఎక్కువ ముడి సరకు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ వచ్చింది. అయినా చీరలు నేశారు. ప్రస్తుతం మాస్టర్ వీవర్స్, కార్మికుల వద్ద దాదాపు 2లక్షల చీరలు ఉన్నట్లు అంచనా. ఒక్కో చీర ధర రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. సగటున రూ.15 వేలు వేసుకున్నా రూ.300 కోట్ల విలువైన చీరలు నిల్వ ఉన్నాయి.
- మరో ఏడాది కష్టమే...
మదనపల్లె, ధర్మవరంలో కంచిపట్టు చీరలు ఏ నెలకు ఆ నెల అమ్ముడుపోతాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వీటికి మంచి మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అంతర్‌రాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇచ్చినా మార్కెట్ పుంజుకోలేదు.ఇప్పటికే వస్త్ర దుకాణాల్లో నిల్వలు ఉన్నాయి. అవి విక్రయిస్తేనే వ్యాపారులు నేతన్నల వద్ద కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే.. మరో ఏడాది పాటు కష్టాలు తప్పేలా లేవు. కనీసం ప్రభుత్వం కొనుగోలు చేసైనా ఆదుకోవాలని కోరుతున్నారు. - పట్టు నేసిన చేతులతో మట్టి పనికి
ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు యోగేశ్ 13 ఏళ్లుగా కంచిపట్టు చీరలను నేసి, వ్యాపారులకు విక్రయిస్తారు. అలా వచ్చిన మొత్తంతోనే తల్లిదండ్రులను పోషించాలి. లాక్‌డౌన్‌కు ముందు రూ.40 వేలతో ముడి సరకు కొన్నారు. ఈ రెండు నెలల్లో తమ్ముడితో కలిసి మొత్తం 9 చీరలు నేశారు. ఇప్పుడు వ్యాపారులూ కొనుగోలు చేయలేదు. పూటగడవని పరిస్థితి. అప్పు ఇచ్చేవారు లేక, తాకట్టు పెట్టడానికి సొత్తూ లేక తోట పనికి వెళ్తున్నారు.