అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అటవీ ప్రాంతమది. సాధారణంగా పొలంలో వ్యవసాయ పనులు చేసుకునేందుకు వెళుతున్న కొందరు రైతులు అనుకోకుండా తారసపడిన ఓ చిట్టి చిరుత పిల్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడూ వారికి అటువంటి ఘటన ఇంతకు ముందు ఎదురు కాలేదు. చుట్టుపక్కల ఎక్కడా మరే ఇతర జంతువులు కనిపించకపోవడంతో అది అక్కడికి ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. బిక్కుబిక్కు మంటూ అక్కడే తిరుగుతున్న ఆ చిరుత పిల్ల విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు తెలిపారు.
విషయం తెలుసుకోవడంతో.. వెంటనే అప్రమత్తమైన అధికారులు బ్రహ్మసముద్రం మండలం వెంకటాపురం గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆ చిరుత కూనను వెంటనే తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అది ఆకలితో ఉందని గమనించి వెంటనే దాని ఆకలి తీర్చేందుకు ప్రయత్నించారు. వెంటనే పాలు తెప్పించి దానికి తాగించారు. ఆ తరువాత కొద్ది సేపటికి దాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పశువైద్యులను అక్కడికి రప్పించారు. వైద్యులు ఆ ఆడ చిరుత పిల్లకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. దాని ఆరోగ్యం స్థిమితంగానే ఉందని.. దానిని అక్కడి నుంచి తరలించవచ్చని అటవీ అధికారులకు స్పష్టం చేశారు.
వైద్యులు దానిని తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటవీ శాఖ దానిని స్వాధీనం చేసుకుని సురక్షితంగా తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలకు తరలించాలని నిశ్చయించుకున్నారు. దానిని తరలించేందుకు ప్రత్యేకంగా ఓ ఇనుప బోనును తెప్పించారు. ఆ తరువాత ప్రత్యేక వాహనంలో ఆ చిరుతను రోడ్డు మార్గంలో క్షేమంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇంతలోని ఇలా చిరుత పిల్ల ఒకటి కనిపించిందని తెలుసుకున్న స్థానికులు, యువకులు దానిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. అటవీ అధికారుల వద్ద ఉన్న ఆ చిట్టి చిరుత పిల్లను తమ ఫోన్‌తో వీడియోలు, చిత్రాలు తీశారు. మెుదటి సారి తమ గ్రామ సమీపంలో ఇలా ఓ చిరుత పిల్లను చూశామని.. ఇది తమను ఆనందానికి గురిచేసిందని వారు అన్నారు. ఎట్టకేలకు చివరికి దానిని అటవీ అధికారులు దానిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.
ఇదీ చదవండి: