శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. నవతరాన్ని తీర్చిదిద్ది మేధావులుగా సమాజానికి అందించిన సమున్నత పీఠిక. కేవలం బోధనే కాక.. సమాజ అవసరాలకు అనుగుణంగా భావితరాన్ని మలిచిన వేదిక. బోధన, పరిశోధన, విస్తరణలోనూ తనదైన ముద్ర వేసింది. అయితే... తాజాగా కొంత విభిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఏటా పదవీ విరమణ జరుగుతున్నా కొత్తగా పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. అనుభవజ్ఞులైన ఆచార్యులు పదవీ విరమణ చేస్తుండటంతో ఆయా విభాగాల్లో అభివృద్ధి అంతటితో ఆగిపోతోంది. పరిశోధన పూర్తిగా పడకేయగా బోధన దయనీయంగా మారింది. ఆగస్టు నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ.. ప్రమాణాల విద్య దరి చేర్చేలా అడుగులు వేయాల్సిన కీలక తరుణమిది.
వర్సిటీలో మైక్రోబయాలజీ విభాగం ఆరేళ్ల కిందట ఆరుగురు ఆచార్యులతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశోధనలకు మార్గం చూపింది. ఏటా ఒక్కొక్కరుగా ఆచార్యులు పదవీ విరమణ చేస్తూ వచ్చారు. 2019 నుంచి కనీసం ఒక్కరూ లేరు. పోస్టుల భర్తీ కూడా జరగలేదు.
ఎస్కేయూలో పాలిమర్ సైన్సు విభాగంలో ఐదుగురు ఆచార్యులు ఉంటే.. ఏకంగా 15 మంది ఆచార్యులు ఉన్న విభాగాలతో పోటీ పడి పరిశోధన పత్రాలు, ప్రాంగణ నియామకాల్లో వర్సిటీలోనే ప్రథమంగా నిలిచింది. పరిశోధనలకు ఫిస్ట్, పలు ప్రాజెక్టుల ద్వారా రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. 2016 జూన్ 30 నుంచి ఒక్క ఆచార్యులు లేని పరిస్థితి.
కొలువుల భర్తీ ఊసేదీ?
వర్సిటీ అవసరాల మేరకు గతంలో పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష పూర్తి అయింది. ఫలితాలు ప్రకటించారు. అభ్యర్థులకు మౌఖికం నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇచ్చే సమయంలో ఆగిపోయింది. గతంలో ప్రకటించిన పోస్టులపై ఏవిధమైన నిర్ణయం లేదు.
కొరత.. కలత
గత విద్యాసంవత్సరంలో సైన్సు విభాగాలకు టీచింగ్ అసిస్టెంట్లు కనీసం 47 మంది అవసరమని గుర్తించారు. ఆర్ట్స్ విభాగాల్లో 36 మంది అవసరమని ప్రతిపాదించారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఆ సంఖ్య పెంచాలి. ఆంగ్లం, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎలక్ట్రానిక్స్, పాలిమర్‌సైన్సు, హిందీ, జాగ్రఫీ, సెరికల్చర్, జువాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, హిస్టరీ, లైబ్రరీ సైన్సుల్లో కొరత ఉంది.
పరిశోధనం.. ప్చ్
ఏటా కనీసం 25 నుంచి 30 పరిశోధన ప్రాజెక్టులు ఉండేవి. రూ.50 కోట్లతో పరిశోధనలు సాగేవి. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో మాత్రమే పరిశోధన ప్రాజెక్టులు సాగుతున్నాయి. పీహెచ్‌డీ విద్యార్థులు 1,000 నుంచి 1,500 మంది వివిధ విభాగాల్లో పరిశోధనలు చేస్తుండగా.. తాజాగా అనుబంధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వీలు కల్పించినా 189 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
ప్రమాణాలకు ప్రతిబంధకం
అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేక ప్రమాణాలకే ప్రతిబంధకంగా మారింది. నాక్ ఏ గ్రేడింగ్‌లో సైతం పురోగతి లేదు. 2020-21లో నాక్‌కు వెళ్లాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఆచార్యులు, బోధన, పరిశోధన ఉంటేనే ఏ గ్రేడ్ దక్కుతుంది. 2021కి కేవలం 34 మంది మాత్రమే ఆచార్యులు ఉంటారు.
ప్రభుత్వమే నిర్ణయించాలి
వర్సిటీలో బోధకుల కొరత వాస్తవమే. 2019 విద్యాసంవత్సరంలో 73 టీచింగ్ అసిస్టెంట్లకు పాలక మండలిలో ఆమోదం పొందినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కనీసం టీచింగ్ అసిస్టెంట్లను ఇవ్వాలని అనుమతి కోరుతాం. నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన 118 పోస్టులకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్
ఇదీ చదవండి: