కాంచీపురంలో చేనేత మగ్గాలు తగ్గి, పవర్‌లూమ్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్కడ చేనేత మగ్గాల సంఖ్య 5 వేల నుంచి 500కు తగ్గింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గడిచిన ఏడేళ్లుగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు పెరిగాయి. ఎంతో మంది చేనేతలు మరమగ్గాలను వదిలేసి, పరిశ్రమల్లో పనులకు వెళ్తున్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో పట్టుచీరల తయారీ లేదు. ఇక మదనపల్లె, ధర్మవరంలో కంచిపట్టు చీరల తయారీ క్రమంగా పెరిగింది. లాభదాయకంగా ఉండటంతో మన నేతన్నలు పెద్దఎత్తున తయారు చేస్తున్నారు.
కంచి చేనేతలకు మించిన ప్రతిభతో ధర్మవరం చేనేత కార్మికులు ఫిదా చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ఎక్కడ కంచి చీరలు విక్రయిస్తున్నా... అందులో వందలో 70 వరకు ధర్మవరంలో తయారైనవే ఉంటున్నాయి. దేశంలో చేనేత వ్యవస్థ ఎంత దెబ్బతిన్నా... ధర్మవరంలో చేనేత కార్మికులు మాత్రం రాణిస్తూనే ఉన్నారు. దీనికి కారణం.. అక్కడి కార్మికులు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.
పట్టుచీరలు ఎన్ని ఉన్నా మహిళల్ని ఆకర్షించేది మాత్రం ఆధునిక డిజైన్లే. ఒకప్పుడు చీర కొంగు మీద మాత్రమే డిజైన్ ఉండేది. ఇప్పుడు అంచులతో పాటు మొత్తం చీరంతా డిజైన్లతో తయారుచేస్తున్నారు. ధర్మవరం కార్మికులు కంప్యూటర్లో డిజైన్లు తయారు చేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. మన నేతన్నలు కంచిపట్టు చీరల తయారీలో శుద్ధమైన జరీ వాడుతున్నారు. అంచుల్లోనూ, చీర మధ్యనా బుటా పెద్దగా ఉండేలా చూస్తున్నారు.
ధర్మవరంలో 20 వేలు, మదనపల్లెలో 15 వేల మగ్గాలు ఉన్నాయి. కంచిపట్టు చీరల తయారీతో పాటు అనుబంధంగా దారం తీయడం, దారాలకు రంగుల అద్దకం వంటి ప్రక్రియల్లో స్థానికులు ఉపాధి పొందుతున్నారు. రెండు ప్రాంతాల్లో కలిపి దాదాపు 35 వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది.
ఇవీ చదవండి: