ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వల్లే రాయదుర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తప్పుడు పనులు చేస్తూ ప్రజల ఆస్తులను కాజేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన తిరిగి తెదేపా నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
రాయదుర్గంలో పట్టపగలే భౌతిక దాడులు జరిగితే.. వాటిని సమర్థించడం దారుణమని మండిపడ్డారు. దాడి చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట రమణ బాబుపై జరిగిన దాడిపై ఆయన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాయదుర్గంలో వైకాపా నాయకుడు మాధవరెడ్డి నిర్మిస్తున్న ఇల్లు అక్రమమా, సక్రమమా? సూటిగా సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Blind students pension: పింఛన్ విషయంలో కొత్త నిబంధనలు... అంధ విద్యార్థుల అగచాట్లు