power cuts: అనంతపురం జిల్లాలో అత్యధిక మందికి జీవనోపాధి కల్పిస్తున్న పరిశ్రమల్లో.. జీన్స్ దుస్తుల తయారీ తొలిస్థానంలో ఉండగా, చేనేతది రెండోస్థానం. రాయదుర్గంలో రెండున్నర దశాబ్దాలుగా విస్తరించిన జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమ... కరోనాకు ముందు 12 వేల మంది వరకు ఉపాధి కల్పించేది. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి ఈ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న పరిశ్రమలపై.... విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమ యజమానులు అంటున్నారు. దీనిపై ఆధారపడిన కూలీలు సైతం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
కోతలతో సరఫరా చేయలేక : రాయదుర్గంలో దాదాపు 200 జీన్స్ ప్యాంట్లు తయారు చేసే భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవి కాకుండా 700 చిన్నపాటి పరిశ్రమలు, మరో వెయ్యి వరకు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. రెండు నెలలుగా విధిస్తున్న విద్యుత్ కోతల కారణంగా.. భారీ పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమ వరకు అన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయి. సిల్క్ దారం పరిశ్రమల్లో కూడా.... వచ్చిన ఆర్డర్లకు దారం సరఫరా చేయలేక ఇబ్బంది పడుతున్నామని పరిశ్రమ యజమానులు అంటున్నారు.
అనధికారిక కోతలతో తీవ్ర నష్టం : రాయదుర్గంలో విద్యుత్ శాఖకు శాశ్వతంగా పనిచేసే ఒక్క అధికారి కూడా లేకపోవటం అక్కడి పరిశ్రమలకు శాపంగా మారింది. ఓవైపు ప్రభుత్వం అధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తుంటే, స్థానికంగా అనధికారిక కోతలు విధిస్తున్నారని పరిశ్రమ నిర్వాహకులు అంటున్నారు. దీంతో జీన్స్ పరిశ్రమపై ఆధారపడిన వారు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి : విద్యుత్ సరఫరాను మెరుగుపరచకపోతే రాయదుర్గంలో ఇప్పటికే 20శాతంపైగా మూతపడిన జీన్స్ పరిశ్రమ... పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. ముడిసరుకు ధరల పెరుగుదలతో అల్లాడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని జీన్స్ తయారీదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన కరెంటు కష్టాలు.. మనకే ఎందుకీ కోత?