Villagers angry on Teacher: పాఠశాలలోకి వెళ్లకుండా ఉపాధ్యాయుడిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామంలో జరిగింది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న షాకీర్ బాషా అనే ఉపాధ్యాయుడు ప్రతి రోజు 11గంటలకు రావడాన్ని నిరసిస్తూ పాఠశాలలోకి వెళ్లకుండా గ్రామ ప్రజలు మంగళవారం అడ్డుకుని.. పాఠశాల గేట్లు మూసివేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా రావడంపై ఉపాధ్యాయుడిని నిలదీశారు. అలాగే 11గంటలకు హాజరైనా 8.30 గంటలకే హాజరయ్యే విధంగా యాప్ సెట్ చేసుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
పాఠశాలకు ఆలస్యంగా రావడం, పాఠాలు సక్రమంగా బోధించకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడి పని తీరుపై హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ ఉపాధ్యాయుడు మాకొద్దని విద్యార్థులు ,తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు ఆలస్యంగా రావడంతో పాటు గ్రామస్తులపై మండిపడటంతో ఈ పంచాయతీ బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ కు చేరింది. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: