అనంతపురం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాయదుర్గం, గుత్తి, పామిడి, బ్రహ్మసముద్రం, ఉరవకొండ మండలాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రాయదుర్గం మండలంలోని బొమ్మకపల్లి, ఆవులదట్ల, రేకులకుంట, రాయంపల్లి, బీఎన్ హళ్లి గ్రామాల్లో వేర్లతో సహా చెట్లు కూలిపోయాయి. మరొచోట గొర్రెల షెడ్డు నలభై అడుగుల దూరానికి పైపులతో సహా కొట్టుకుపోయింది. గుత్తి, పామిడి మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. బ్రహ్మసముద్రం మండలంలో పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి.
టి.రుద్రంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పండ్లతోటలోని వందలాది బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. ముప్పలకుంట గ్రామంలోని నాలుగు ఎకరాల మునగ తోట పూర్తిగా దెబ్బతింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉరవకొండ పట్టణ వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఇందిరానగర్ కాలనీల్లోని డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి చేరాయి. ఫలితంగా కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు.