అనంతపురం జిల్లాను వరణుడు కరుణించాడు. గతేడాదితో పోలిస్తే ఈదఫా ముందే వానలు విస్తారంగా కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే నమోదైంది. బుధవారం రాత్రి.. గురువారం ఉదయం వర్షం బాగా పడింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 53 మండలాల్లో కురిసింది. వివిధ రకాల జల వనరుల్లో 8.773 టీఎంసీల నీరు నిల్వ ఉండటం ప్రస్తావనార్హం. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ నీటి మట్టం 2.12 మీటర్లు పెరగడం సంతోషకరం. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో సాధారణ వర్షపాతం 84.3 మి.మీ.. ఉంటే ఏకంగా 135.9 మి.మీ కురిసింది. వెరసి సేద్యపు కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లోకి కొత్తనీరు చేరుతుండటంతో ఎక్కడికక్కడ స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అన్నదాతల్లో ఆశలు రెట్టింపు అయ్యాయి.
88.08 టీఎంసీల వాన..
వాన కాలం సీజన్ జూన్ మొదటి నుంచే ఆరంభమయ్యే సంగతి తెలిసిందే. భూగర్భ జల శాఖ గణాంకాల ప్రకారం చూస్తే... ఈ సీజన్‌లో ఇప్పటి దాకా జిల్లాలో 88.08 టీఎంసీల వర్షం కురిసింది. ఇందులో 10.56 టీఎంసీలు భూగర్భ జలంగా మారింది. తత్ఫలితంగా జిల్లా భూగర్భ నీటి మట్టం 23.34 మీటర్లగా నమోదైంది. గత నెలలో 25.46 మీటర్లు ఉండేది. దీనితో పోలిస్తే తాజాగా 2.12 మీటర్లు పెరగడం విశేషం. అదే గతేడాది జులై 9 నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 26 మీటర్లు ఉంటే ఇప్పుడు 23.34 మీటర్లగా ఉంది.
388 చెరువుల్లో చేరిక...
అనంతపురం జిల్లాలో మొత్తం 1,468 చెరువులు ఉన్నాయి. వీటి సామర్థ్యం 26 టీఎంసీలపైనే ఉంది. ప్రస్తుత వానలు జోరుగా కురుస్తున్న నేపథ్యంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈమధ్య కురిసిన వాన నీరు జిల్లాలో 48 మండలాల పరిధిలోని 388 చెరువుల్లోకి చేరాయి. పాత, కొత్త నీటిని కలిపితే 3.951 టీఎంసీలు నిల్వ ఉంది. వంద శాతం భర్తీగా ఉన్న చెరువులు 23 ఉంటే.. 75 శాతం దాకా ఉన్నవి 43, యాభై శాతం దాకా నీరు ఉన్నవి 82 ఉన్నాయి. 25 శాతంలోపు నీరు నిల్వ ఉన్న చెరువులు 240 ఉన్నాయి.
పల్లెల్లో జల సవ్వడి
ఆశించిన మేర వర్షాలు కురుస్తుండటంతో పల్లెలన్నీ పచ్చని పైర్లతో పరవశిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, వాగులు.. వంకలు.. ఇవే గ్రామ సంపద. సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. జిల్లాలో 1.13లక్షల సేద్యపు కుంటలు ఉంటే... 98,821 కుంటల్లోకి వర్షపు నీరు చేరింది. 2.812 టీఎంసీలు నిల్వ ఉంది. అన్ని విభాగాలకు చెందిన 58,982 చెక్‌డ్యామ్‌ల్లోకి 2.010టీఎంసీలు చేరాయి. చాలా చోట్లా చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకల్లో నిర్మించడంతో వాన నీటితో పూర్తిగా నిండాయి.
భూములు పదును
అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రంతా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వివిధ మండలాల్లో జోరువాన కురవడంతో భూములు బాగా పదునెక్కాయి. వేసిన పంటలతోపాటు విత్తుకునే రైతులకు ఈ వర్షాలు ఎంతో ఉపకరిస్తాయని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి: